
సినిమాలో నా సీన్లని తీసేశారు: హీరోయిన్
సినీ పరిశ్రమ అంతటి నిర్దయ గల పరిశ్రమ మరొకటి లేదంటారు. అలాంటి చేదు అనుభవమే తనకు ఎదురైందని వాపోతోంది నటి సోనీ కౌర్. బ్రిటన్‌లోని భారత సంతతికి చెందిన ఆమె.. తాజాగా 'ఏక్ హసీనా థి ఏక్ దీవానా థా' సినిమాలో నటించింది. దర్శకుడు సునీల్ దర్శన్ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ గతవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమా దర్శకుడు తనను మోసం చేశాడని నటి సోనీ కౌర్ వాపోతున్నది. తనను గ్రాండ్‌గా చిత్రపరిశ్రమకు పరిచయం చేస్తానని చెప్పిన దర్శన్ మాట తప్పాడని తెలిపింది.
'సునీల్ దర్శన్ గత ఏడాది నన్ను సంప్రదించారు. దీంతో ఆయనను కలిసేందుకు నేను ముంబై వచ్చాను. ఆయన నాకు సినిమాలో రీటా పాత్రను ఇచ్చారు. కానీ ఈ సినిమా షూటింగ్ పూర్తికావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా ట్రైలర్ ఆవిష్కరణ నుంచి దర్శకుడు నాతో మాట్లాడటం మానేశాడు. సినిమా ప్రీమియర్ గురించి కూడా నాకు తెలుపలేదు. నేను స్వయంగా ప్రొడక్షన్ టీంను సంప్రదించి ప్రీమియర్ గురించి తెలుసుకున్నాను.
అయితే, నేను ప్రీమియర్‌కు వచ్చేందుకు టికెట్ కూడా బుక్ చేయలేదు. నేను సొంత ఖర్చుల మీద ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను కలిసేందుకు దర్శకుడు నిరాకరించారు. ఇక నేను సినిమా చూశాను. అందులో నా సీన్లను చాలావరకు తీసేశారు. దర్శకుడు నాకు చెప్పిన దానికి పూర్తి భిన్నంగా ప్రవర్తించారు' అని ఆమె మీడియాకు తెలిపారు. అయితే, దర్శకుడు ఆమె వాదనను కొట్టిపారేశారు. మీడియా పబ్లిసిటీ కోసమే ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందని దర్శకుడు దర్శన్ పేర్కొన్నారు.