
పాకిస్థాన్‌కు గట్టి ఝలక్ ఇచ్చిన అఫ్ఘాన్
అమృత్‌సర్: అమృత్‌సర్‌లో జరుగుతున్న ‘హార్ట్ ఆఫ్ ఆసియా’ సదస్సు వేదికగా పాకిస్థాన్‌పై అఫ్ఘానిస్థాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. తమ దేశంపై పాక్ అప్రకటిత యుద్ధం చేస్తున్నదని, తాలిబన్ సహా పలు ఉగ్రవాద నెట్‌వర్క్‌లకు రహస్యంగా సాయం చేయడం ద్వారా తమ దేశాన్ని నాశనం చేస్తున్నదని అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ మండిపడ్డారు. అదే సమయంలో అఫ్ఘాన్‌లో పెరిగిపోతున్న భారత్ ప్రమేయాన్ని ఆయన సమర్థించారు. అఫ్ఘాన్ పునర్నిర్మాణంలో భారత్ పాత్ర పెరుగుతుండటంలో ఎలాంటి రహస్య ఒప్పందాలు లేవని స్పష్టం చేశారు.
ఉగ్రవాదం, తీవ్రవాదం, అక్రమ కార్యకలాపాల ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారో తేల్చడానికి ఆసియా స్థాయిలో లేదా అంతర్జాతీయ స్థాయిలో యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాల్సిందేనని, ఇందులో ఎలాంటి దోబుచులాటలకు తావులేదని అష్రఫ్ స్పష్టం చేశారు. పాక్‌తో తాము ద్వైపాక్షిక, అంతర్జాతీయ సంబంధాలు కోరుకుంటుండగా.. ఆ దేశం మాత్రం తమపై అప్రకటిత యుద్ధం చేస్తున్నదని, 2014లో జరిగిన బ్రస్సెల్స్ సదస్సు నుంచి ఈ అప్రకటిత యుద్ధం ముమ్మరమైనదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా అఫ్ఘాన్ పునర్నిర్మాణానికి పాక్ ఇవ్వజూపిన 500 మిలియన్ డాలర్ల (రూ. 3400 కోట్ల) సాయాన్ని కూడా అష్రఫ్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. తమకు ఇవ్వజూపిన డబ్బేదో ఉగ్రవాద నిర్మూలనకు ఉపయోగించాలని, అంతేకానీ ఒకవైపు డబ్బు ఇస్తూ మరోవైపు ఉగ్రవాదులను ప్రోత్సహిస్తే ఎలాంటి ప్రయోజన ఉండదని పేర్కొన్నారు. పాక్ ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న ఉగ్రవాద సంస్థలు ఆ దేశ భూభాగంలో ఉన్నాయని, పాక్ మద్దతు లేకుంటే తాము ఒక్క నెల కూడా మనలేమని తాలిబన్లే స్వయంగా చెప్తున్నారని ఆయన స్పష్టం చేశారు. భారత్ మద్దతు, ప్రధాని నరేంద్రమోదీ వెన్నుదన్నుతోనే అఫ్ఘాన్ అధినేత అష్రఫ్ ఘనీ పాక్‌కు వ్యతిరేకంగా ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు.