
మన దేశం నుంచి మరో నూడుల్స్ ఔట్!
మ్యాగీ వివాదం తర్వాత భారతీయ మార్కెట్ల నుంచి తమ నూడుల్స్ను ఉపసంహరించుకోవాలని మరో బహుళ జాతీయ కంపెనీ నిర్ణయించుకుంది. ఇండో నిస్సాన్ కంపెనీ తమ 'టాప్ రామెన్' బ్రాండు నూడుల్స్ను ఇక్కడి మార్కెట్ల నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ఆహార భద్రతా నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి అందిన ఉత్తర్వుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈనెల ఆరంభంలో మ్యాగీ నూడుల్స్ను నెస్లె కంపెనీ మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుని, వాటిని ధ్వంసం చేయాల్సి వచ్చింది. హిందుస్థాన్ యూనిలీవర్ కూడా తమ 'నార్' ఇన్స్టెంట్ నూడుల్స్ను ఇలాగే ఆహార భద్రతా కారణాల రీత్యా ఉపసంహరించుకుంది. భారతదేశంలో అమ్ముతున్న అన్ని బ్రాండుల ఇన్స్టెంట్ నూడుల్స్ను పరీక్షించాలని ఆహారభద్రతా సంస్థ నిర్ణయించింది.
వాటిలో మోనోసోడియం గ్లూటామేట్ (ఎంఎస్జీ)తో పాటు సీసం పరిమాణాల్ని కూడా పరీక్షించారు. దాంతో క్రమంగా ఒక్కో కంపెనీకి సమాచారం అందడం, వాళ్లు తమ నూడుల్స్ను ఉపసంహరించడం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు తాజాగా టాప్ రామెన్ వంతు వచ్చింది. నూడుల్స్తో పాటు పాస్తాలు, మాకరోని బ్రాండులన్నింటినీ ఆహార భద్రతా సంస్థ పరీక్షించింది. నెస్లె ఇండియా, ఐటీసీ, ఇండో నిస్సిన్ ఫుడ్ లిమిటెడ్, జీఎస్కే కన్స్యూమర్ హెల్త్కేర్, సీజీ ఫుడ్స్ ఇండియా, రుచి ఇంటర్నేషనల్, ఏఏ న్యూట్రిషన్ తదితర సంస్థలు వీటిని తయారుచేస్తున్నాయి. నెస్లె ఇప్పటివరకు రూ. 320 కోట్ల విలువైన మ్యాగీ ప్యాకెట్లను ధ్వంసం చేసింది.