నోట్ల రద్దుపై పేటీఎం వివాదాస్పదమైన యాడ్
నోట్ల రద్దుపై పేటీఎం వివాదాస్పదమైన యాడ్
Published Mon, Nov 14 2016 1:05 PM | Last Updated on Sat, Aug 25 2018 6:37 PM
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో జరిగిన ట్విట్టర్ వార్లో గతవారమే పేటీఎం సీఈవో శేఖర్ శర్మ ముప్పుతిప్పలు పడగా.. ఈ యాప్ మరోసారి మరో వివాదంలో చిక్కుకుంది. బ్లాక్మనీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్లు రద్దును తనకు అవకాశంగా మరలుచుకున్న పేటీఎం యాప్ ఓ వివాదాస్పదమైన ప్రకటనను రూపొందించింది. దేశీయంగా అతిపెద్ద ఆన్లైన్ లావాదేవీ యాప్లో ఒకటిగా నిలుస్తున్న పేటీఎంపై ఈ యాడ్ను విడుదల చేసిన వెంటనే ట్విట్టర్లో మరోసారి దాడి మొదలైంది. '' డ్రామా బంద్ కరో.. పేటీఎం కరో'' అనే ట్యాగ్లైన్తో ఈ యాడ్ను పేటీఎం రూపొందించింది. కంపెనీతో పాటు తన మ్యాక్కాన్ ఢిల్లీ ఏజెన్సీ ఈ యాడ్ను క్రియేట్ చేసింది. పేటీఎం విడుదల చేసిన ఈ యాడ్, ప్రస్తుతం చాలామంది సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిస్థితులను కించపరుస్తూ దారుణంగా ఉందని ట్విట్టర్ ప్రజలు మండిపడుతున్నారు.
కొంతమందైతే ఈ యాప్ను అన్ ఇన్స్టాల్ చేసేస్తామని ట్విట్టర్లో ప్రకటించేశారు. పెద్ద నోట్ల రద్దుతో ఓ వైపు ప్రజలు ఇబ్బందిపడుతుంటే, యాడ్స్తో ఇలా హేళన చేస్తారా? అని అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఆసుపత్రి బిల్లులు, గృహావసరాల కోసం కొనుగోళ్లు, ట్రావెల్, వర్క్ వంటి విషయాలల్లో ప్రజలు పడరాని కష్టాలు పడుతుంటే, వారి బాధలు మీకు డ్రామాగా ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. ట్విట్టర్లో వస్తున్న పలు విమర్శలనంతరం పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ ఆ యాడ్పై ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఆ యాడ్ను అప్గ్రేడ్ చేస్తామని ప్రకటించారు. ఈ యాడ్పై ట్విట్టర్ విమర్శలు కొనసాగుతున్నప్పటికీ, పేటీఎం ద్వారా జరిగే లావాదేవీలు గరిష్ట స్థాయిలను తాకాయి. అంతకు ముందు ఒక్కరోజుకు 2.5-3 మిలియన్ లావాదేవీలు జరుగుగా...ప్రస్తుతం 5 మిలియన్ లావాదేవీలు జరిగి రికార్డు బ్రేక్ చేశాయి. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ఎక్కువగా చెల్లింపులకు మొబైల్ వాలెట్లను ఉపయోగించడంతో పేటీఎం వినియోగదారులు భారీగా పెరిగారు.
Advertisement