చిన్నమ్మ పగ్గాలు తీసుకో..!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ నటరాజన్ అన్నాడీఎంకే అధినేతగా పగ్గాలు చేపట్టేందుకు సర్వం సిద్ధమవుతోంది. చిన్నమ్మకు పార్టీ పగ్గాలు అప్పగించడం ఖాయమని ఇప్పటికే అన్నాడీఎంకే నేతలు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు అందించేందుకు వీలుగా రంగం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అన్నాడీఎంకే జిల్లా విభాగాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి.. అధినాయకత్వానికి పంపుతున్నాయి. మొదట దక్షిణ చెన్నైకు చెందిన పార్టీ విభాగం అధికారిక తీర్మానం చేసింది. జయలలిత సమస్యల్లో ఉన్నప్పుడు ఆమెకు శశికళ అండగా నిలిచారని, ఆమె జైలుకు వెళ్లినప్పుడూ వెంట నడిచారని, కాబట్టి ఇప్పుడు పార్టీని నడిపించాల్సిన బృహత్ బాధ్యత శశికళపై ఉందని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.
శశికళ తన జీవిత సర్వస్వాన్ని జయలలిత కోసం త్యాగం చేశారని, ఇప్పుడు పార్టీని కాపాడి.. పార్టీ నాయకులను, శ్రేణులను ముందుకు నడపాల్సిన బాధ్యత ఆమెపై ఉందని, కాబట్టి పార్టీ నాయకత్వాన్ని ఆమె చేపట్టాలని కోరుతూ తీర్మానం చేశారు. పార్టీ జిల్లా విభాగం నేతల భేటీలో ఈ తీర్మానం చేపట్టడానికి ముందు సీఎం పన్నీర్ సెల్వం, ఇతర జిల్లా సీనియర్ నేతలు మేరినా బీచ్‌లో జయలలిత సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం తీర్మాన ప్రతిని పోయెస్ గార్డెన్‌కు వెళ్లి శశికళకు అందజేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతలను చేపట్టాలని ఆమెను అధికారికంగా విజ్ఞప్తి చేశారు.