మంగళగిరి ఎయిమ్స్‌కు ఓకే
సాక్షి, న్యూఢిల్లీ/మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ వివరాలను కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ మీడియాకు వెల్లడించారు. ‘ప్రధాన మంత్రి స్వస్థ్య సురక్ష యోజన(పీఎంఎస్‌ఎస్‌వై) పథకం ద్వారా కొత్తగా మూడు ఎయిమ్స్ తరహా బోధనాసుపత్రుల నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్, పశ్చిమ బెంగాల్‌లోని కల్యాణి, ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో వీటిని నిర్మిస్తాం.
ఈ మూడు ప్రాజెక్టులకు మొత్తం రూ. 4,949 కోట్లు వ్యయం అవుతుంది’ అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. ఏపీలో ఎయిమ్స్ నిర్మాణం ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో కేంద్రం పొందుపరిచిన హామీ ప్రకారం జరుగుతోంది. మిగిలినవి 2014-15 బడ్జెట్‌లో పొందుపరిచినవి. మంగళగిరి ఎయిమ్స్‌కు రూ. 1,618 కోట్లు, నాగ్‌పూర్‌కు రూ. 1,577 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ. 1,754 కోట్లు వెచ్చిస్తారు. ప్రతిపాదిత ఒక్కో ఎయిమ్స్‌లో 960 పడకల ఆసుపత్రి ఉంటుంది. అలాగే టీచింగ్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఆయుష్ బ్లాక్, ఆడిటోరియం, నర్సింగ్ కాలేజి, నైట్ షెల్టర్, హాస్టల్‌తో పాటు వసతి సదుపాయాలు ఉంటాయి.
నాణ్యమైన వైద్య విద్య, నర్సింగ్ విద్య, ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ జాతీయ స్థాయి సంస్థలు ఏర్పాటు చేస్తున్నామని గోయెల్ వివరించారు. వీటి ఏర్పాటు ఆయా రాష్ట్రాలకు పొరుగునే ఉన్న రాష్ట్రాలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వైద్య పరంగా వెనుకబాటుకు గురైన ప్రాంతాల్లో వైద్య నిపుణులను తయారు చేయడానికి ఇవి తోడ్పడతాయని ఆయన తెలిపారు. నిర్మాణానికి ముందు దాదాపు 12 నెలలు ప్రణాళిక కోసం, ఆ తరువాత 48 నెలలు నిర్మాణానికి సమయం పడుతుందని వివరించారు.