నేల నీదే... నింగీ నీదే!
మనకు పరుగెత్తే కార్ల గురించి తెలుసు... ఎగిరే డ్రోన్ల గురించి వింటూ ఉంటాం. మరి ఈ రెండూ కలిసిపోతే... అవసరమైనంత వరకూ రోడ్లపై పరుగులు పెట్టి... ఆ తరువాత అకస్మాత్తుగా పైకి ఎగిరి గమ్యాన్ని చేరుకుంటే? అద్భుతంగా ఉంటుంది కదూ! విమాన తయారీ సంస్థ ఎయిర్‌బస్ కూడా ఇదే అంటోంది. అనడమే కాదు... ఇలాంటి హైబ్రిడ్ రవాణా వ్యవస్థలు ఎలా సాధ్యమవుతాయో వివరిస్తోంది కూడా. కావాలంటే పక్క ఫొటోలు చూడండి. ఎయిర్‌బస్ తయారు చేయాలని సంకల్పిస్తున్న సరికొత్త రవాణా వ్యవస్థ తాలూకూ డిజైన్లు ఇవి. దీనికి ఎయిర్‌బస్ పెట్టిన పేరు ‘పాప్ అప్’.
ఏంటి దీని ప్రత్యేకత అంటే... చాలా సింపుల్... అవసరమైనప్పుడు ఇది రెండు భాగాలుగా విడిపోగలదు. అడుగున ఉన్న భాగం కారులా పనిచేస్తుంది. పైన ఉన్నది ప్రయాణీకులు కూర్చునే క్యాబిన్‌లా ఉంటుంది. ఈ క్యాబిన్‌కు నాలుగు ప్రొపెల్లర్లు ఉన్న ఇంకోభాగం వచ్చి అనుసంధానమవుతుంది. ఆ తరువాత అది డ్రోన్‌లా పైకి ఎగిరిపోతుంది. మనల్ని గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఎయిర్‌బస్ ‘ప్రాజెక్టు వాహన’ పేరుతో ఎగిరే కారునొకదాన్ని తయారు చేస్తున్నామని గత ఏడాదే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ కొత్త డిజైన్ హైబ్రిడ్ వాహనాన్ని రూపొందించారు.
డ్రైవర్లు అవసరం లేని, పూర్తిగా విద్యుత్తుతో మాత్రమే నడిచే ఈ వాహనం పూర్తిగా కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోగల అప్లికేషన్‌తో... ఇప్పుడు మీరు ఊబర్, ఓలా వంటి ట్యాక్సీలను బుక్ చేసుకున్నట్టుగానే దీన్ని కూడా ఆన్ డిమాండ్ బుక్ చేసుకోవచ్చు. ఆ తరువాత మొత్తం ఈ వాహనమే చూసుకుంటుంది. ఎంత దూరం రోడ్డుపై వెళ్లాలి... డ్రోన్ రూపంలో ఎంత దూరం ఎగిరి వెళ్లాలి వంటివన్నమాట. ట్రాఫిక్ జామ్‌లలో ఇరుక్కోకుండా నగరాల్లో సాఫీగా ప్రయాణించేందుకు ఇదో మేలైన మార్గం అంటోంది ఎయిర్‌బస్... 2030 నాటికల్లా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నది ఎయిర్‌బస్ ఆలోచన. చూద్దాం ఏమవుతుందో!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్
రోడ్లపై పరుగెడుతూ, అవసరమైనపుడు అకస్మాత్తుగా పైకి ఎగిరి గమ్యాన్ని చేరుకునేలా ఎయిర్‌బస్ కంపెనీ డిజైన్ చేసిన అద్భుత వాహనం ‘పాప్ అప్’