చిక్కుల్లో చిదంబరం
- మ్యాక్సిస్‌లో ఆయన పాత్రపై ఈడీ నివేదిక
- కొనసాగుతున్న సీబీఐ దర్యాప్తు
- తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదావేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్–మ్యా క్సిస్ వ్యవహారం కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత చిదంబరం మెడకు తీవ్రంగానే చుట్టుకుంటోంది. నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందానికి అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సోమవారం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. విదేశీ పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) నిబంధనల ఉల్లంఘనలో ఆర్థికమంత్రిగా చిదంబరం పాత్రపై ఈడీ దర్యాప్తు జరిపింది. ఇప్పటికే ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ ఇందులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తి పాత్రపై దర్యాప్తు జరుపుతున్నట్టు కోర్టుకు వివరించింది. దీనిపై స్పందించిన కోర్టు దర్యాప్తు స్థితిగతులపై నివేదిక సమర్పించాలని సీబీఐని ఆదేశించింది.
అయితే అటార్నీ జనరల్ ముకుల్ రోహ్‌తగీ అందుబాటులో లేనందున కేసు విచారణ మూడువారాలపాటు వాయిదా వేయాలన్న అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. ఈ సందర్భంగా పిటిషనర్, బీజేపీ ఎంపీ సుబ్రమణియం స్వామి మీడియాతో మాట్లాడుతూ ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసు నిందితుల నుంచి కార్తి ఖాతాలకు నిధులు బదిలీ అయినట్టు నిరూపించే ఆధారాలను దర్యాప్తు సంస్థలకు అందజేశానని వెల్లడించారు. ఈ ఒప్పందానికి ఎఫ్‌ఐపీబీ అనుమతి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. గరిష్టంగా రూ. 600 కోట్ల విలువైన ఎఫ్‌డీఐలకు మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థికమంత్రికి ఉంటుందని, అంతకు మించి పెట్టుబడులను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించవలసి ఉంటుందని స్వామి పేర్కొన్నారు.