
ఒబామాకు చుక్కలు చూపించిన చైనా!
అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా చివరి ఆసియా పర్యటన సజావుగా సాగుతుందని అంతా భావించి ఉంటారు కానీ. అలా జరగలేదు. జీ-20 సదస్సు కోసం చైనాలో అడుగుపెట్టింది మొదలు ఆయనను ఘర్షణలు స్వాగతం పలికాయి. ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో హాంగ్‌ఝౌ నగరంలో ఒబామా అడుగుపెట్టిన వెంటనే వైట్‌హౌస్ సిబ్బంది, చైనా అధికారుల మధ్య ఘర్షణలు తలెత్తాయి. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య ఉన్న దౌత్య సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి.
విమానాశ్రయంలో ఒబామాకు చైనా అధికారులు రెడ్‌కార్పెట్ స్వాగతం పలుకలేదు. సరికదా విమానం నుంచి ఆయన దిగేందుకు 'స్టెయిర్‌కేస్' (మెట్లు) కూడా ఏర్పాటుచేయలేదు. దీంతో ప్రత్యామ్నాయ ఎగ్జిట్ నుంచి ఒబామా దిగాల్సి వచ్చింది. దీనికితోడు ఒబామా సహాయకుడికి, చైనా అధికారికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒబామా వెంట వచ్చిన జర్నలిస్టులను, ఆయన వెంట ఎక్కడికంటే అక్కడికి పంపించబోమని, వారిపై నిషేధం ఉంటుందని చైనా అధికారులు చెప్పడం వైట్‌హౌస్ సిబ్బందికి ఆగ్రహం తెప్పించింది. విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు అమెరికా అధ్యక్షుడి వెంట మీడియా సిబ్బంది ఉంటారని, ఈ నిబంధనలను ఉల్లంఘించే ప్రసక్తే ఉండదని వైట్‌హౌస్ సిబ్బంది గట్టిగా వాదించగా.. 'ఇది మా దేశం. మా ఎయిర్‌పోర్ట్'.. మీ నిబంధనలు చెల్లవంటూ చైనా అధికారులు గట్టిగా తిప్పికొట్టారు.
అమెరికా ప్రభుత్వంలో అత్యున్నత ర్యాంకు అధికారి అయిన సుసాన్ రైస్‌ను ఒబామా వెంట వెళ్లనిచ్చేందుకు చైనా అధికారులు అనుమతించలేదు. ఒబామాకు రైస్ జాతీయ భద్రతా సలహాదారు. చైనా అధికారుల ప్రవర్తనపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. వారు ఇలా చేస్తారని తాము అనుకోలేదని పేర్కొంది. ఒబామా కూడా చైనా అధికారుల అత్యుత్సాహంపై స్పందించారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని చెప్పారు. అమెరికా-చైనా అనుసరించే విలువల మధ్య అగాధాన్ని ఈ గొడవ చూపిస్తున్నదని, అయినా జీ20 వంటి పెద్ద సదస్సులు జరుగుతున్నప్పుడు ఇలాంటివి పెద్ద విషయం కాదని ఒబామా పేర్కొన్నారు.