బ్రిస్బేన్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆరోపించారు. ఆదివారం యూరోపియన్ యూనియన్ నేతలతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రష్యా ఇలాగే వ్యవహరిస్తే అంతర్జాతీయ సమాజం నుంచి వెలి వేస్తామని హెచ్చరించారు. ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యాన్ని నిలిపివేయాలని అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, జపాన్‌లు రష్యాను గట్టిగా డిమాండ్ చేశాయి. ఆహార భద్రతపై అమెరికా, భారత్‌ల మధ్య చర్చల్లో పురోగతి సాధించటంపై జీ 20 దేశాధినేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, 2015లో టర్కీ, 2016లో చైనాలు జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
నిద్రొస్తోందని వెళ్లిపోయిన పుతిన్
బ్రిస్బేన్: ఉక్రెయిన్ పట్ల వ్యవహరిస్తున్న తీరుతో జీ 20 సదస్సులో తీవ్ర విమర్శలతో ఉక్కిరిబిక్కిరైనా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏమాత్రం తొణకలేదు. వైఖరి మార్చుకోలేదు. చర్చల సారాంశాన్ని ఆదివారం వెల్లడించక ముందే భేటీ నుంచి పుతిన్ మధ్యలోనే ఆస్ట్రేలియా నుంచి నిష్ర్కమించారు. రష్యాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున కొంత విశ్రాంతి అవసరమని, అందుకే వెళ్లిపోతున్నట్లు చెప్పారు.