అఖిలేశ్‌లా నన్నెవరూ అవమానించలేదు
ఎస్పీ చీఫ్ ములాయం ఆవేదన
లక్నో: మాజీ సీఎం అఖిలేశ్‌లా ఇప్పటివరకు తననెవరూ అవమానించలేదని ఆయన తండ్రి, ఎస్పీ చీఫ్ ములాయంసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. సోదరుడు శివ్‌పాల్‌నూ అగౌరవపరిచాడన్నారు. ‘తండ్రిని అవమానపరిచిన పుత్రుడు రాష్ట్ర ప్రజలకు ఎలా విధేయుడిగా ఉండగలడు’అంటూ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ అఖి లేశ్‌పై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ములాయం ప్రస్తావించారు. మోదీ నిజమే చెప్పారని, తండ్రినే పట్టించుకోనివాడు ఇంకెవరికీ ఉపయోగపడలేడని శనివారం ఇక్కడ ఓ హోటల్ ప్రారంభోత్సవంలో ములాయంసింగ్ ఘాటుగా విమర్శించారు.
మోదీ వ్యాఖ్యలు ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపాయని, ఎస్పీ పరాజయానికి నాంది పలికాయని చెప్పారు. ‘నాలా పూర్తిస్థాయి రాజకీయ జీవితంలో ఉన్న నేతలెవరూ తమ కుమారులను ముఖ్యమంత్రులను చేయలేదు. 2012 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు ఓటేసి గెలిపించినా అఖిలేశ్ యాదవ్‌ను ఆ పీఠంపై కూర్చోబెట్టా. కానీ అతను నన్ను తీవ్రంగా అవమానించాడు. నా రక్తమే నాకు వ్యతిరేకంగా మారింది’ అని ములాయం చెప్పుకొచ్చారు. తనపై మూడు సార్లు హత్యా ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్‌తో అఖిలేశ్ జతకట్టడం అత్యంత బాధాకరమన్నారు.