పాక్లో ఇంకా అల్ఖైదా ఉంది: పెంటగాన్
ఒసామా బిన్ లాడెన్ను అమెరికా హతమార్చిన అల్ఖైదా ఏమైంది? ఇప్పటికీ అది ప్రపంచంలోని ఏదో ఒక మూల నుంచి పనిచేస్తోందా? ఎక్కడో కాదు.. దాని పుట్టినిల్లు పాకిస్థాన్ నుంచే ఆ ఉగ్రవాద సంస్థ భేషుగ్గా పనిచేస్తోందట. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా నిఘా సంస్థ పెంటగానే వెల్లడించింది. అంతేకాదు.. కాశ్మీర్ అంశంపై పాకిస్థాన్, భారత దేశాల మధ్య ఎప్పటినుంచో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రాంతీయ అస్థిరతకు కూడా కారణం అవుతాయని చెప్పింది. ఈ రెండు దేశాలూ కూడా సరిహద్దుల వెంబడి నియంత్రణ రేఖ వద్ద భారీ స్థాయిలో బలగాలను మోహరించాయని యూఎస్ సెంట్రల్ కమాండ్కు చెందిన కమాండర్ జనరల్ లాయిడ్ జె ఆస్టిన్ తెలిపారు.
పాకిస్థాన్లోని గిరిజన ప్రాంతాల్లో అల్ ఖైదా ఇప్పటికీ పనిచేస్తోందని, కొంతవరకు తూర్పు ఆఫ్ఘనిస్థాన్లో కూడా దీని ఉనికి ఉందని ఆయన చెప్పారు. అయితే, ఈ రెండు దేశాల్లో దాని మీద ఒత్తిడి ఎక్కువ కావడంతో ఉగ్రవాద కార్యకలాపాలకు సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటోందని అన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో పాకిస్థాన్ ప్రభుత్వం పెద్దగా కృషిచేసిన పాపాన పోలేదని చెప్పారు. పాక్లోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు, ఇతర హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని, అవి ప్రభుత్వాన్ని వణికిస్తున్నాయని తెలిపారు.