జవాన్ విడుదల కోసం పాక్తో చర్చలు
న్యూఢిల్లీ: పాకిస్థాన్ వద్ద బందీగా ఉన్న భారత జవాన్ను విడుదల చేయించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. పాకిస్థాన్తో అధికారికంగా చర్చలు జరిపి, జవాన్ విడుదలకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
శుక్రవారం రాజ్నాథ్ సింగ్ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దుల్లో భద్రతపై రాజ్నాథ్ అధికారులతో చర్చించారు. పాకిస్థాన్లో బందీగా ఉన్న రాష్ట్రీయ రైఫిల్స్ సైనికుడు చందు బాబూలాల్ చౌహాన్ సర్జికల్ దాడుల్లో పాల్గొనలేదని ఆర్మీ అధికారులు చెప్పారు. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) పోస్ట్ వద్ద విధుల్లో ఉన్న చౌహాన్ దారితప్పి పాక్ భూభాగంలోకి వెళ్లినట్టు తెలిపారు.