
మేనకా గాంధీ వివాదస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజంలో జరుగుతున్న హింసకు పురుషులే కారణమని ఆమె వ్యాఖ్యానించారు. మగాళ్లే హింసకు పాల్పడుతున్నారని నిందించారు. లింగ సమానత్వంలో పురుషుల పాత్ర పెరగాలని పేర్కొన్నారు. ఫేస్ బుక్ యూజర్లతో ఆమె లైవ్ చాట్ చేశారు.
లింగ వివక్షను రూపుమాపేందుకు పాఠశాల స్థాయి నుంచే చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా కొద్ది నెలల క్రిత్రం 'జెండర్ చాంపియన్స్' కార్యక్రమం చేపట్టామని తెలిపారు. బాలికలను గౌరవించి, సాయం చేసే బాలురను ఎంపిక చేసి అవార్డులు ఇస్తామని తెలిపారు. ప్రతి తరగతిలో ఒకరికి వార్షిక పురస్కారం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అలాగే అసమాన తెగువ ప్రదర్శించిన బాలికలకు అవార్డులు ప్రదానం చేస్తామని చెప్పారు.