ఆ బందిపోటు ముఠాలో అందరూ మహిళలే
బెంగళూరు: ఫక్తు సినిమా కథనాన్ని పోలిఉంటుంది వారి దోపిడీ విధానం. హైవేలపై ఉండే చెక్ పోస్టులు, టోల్ గేట్లవద్ద నిస్సహాయులుగా నటిస్తారు. కొద్దిదూరంలో విడిచిపెట్టాల్సిందిగా డ్రైవర్ ను ప్రాధేయపడతారు. అంతలోనే అందమైన మహిళలు వచ్చి వలపు వల వసురుతారు. కట్ చేస్తే.. అన్నీ సర్వస్వం పోగొట్టుకున్న లారీ డ్రైవర్లు లబోదిబోమంటూ పరుగు పెడతారు.
ఉత్తర, మధ్య కర్ణాటక జిల్లాల గుండా వెళ్లే 4వ నంబర్ (చెన్నై- ముంబై), 63 వ నంబర్ (అకోలా- గూటీ) జాతీయరహదారుల్లో ఇప్పటికే పలు లూటీలకు పాల్పడ్డ బందిపోటు ముఠాను గురువారం కర్ణాటక పోలీసులు అరెస్టుచేశారు. ఆశ్చర్యకరంమైన విషయమేమంటే ఆ ముఠాలో సభ్యులందరూ మహిళలే. కొప్పాల్ ఇన్స్పెక్టర్ చిత్తరంజన్ తెలిపిన వివరాల ప్రకారం..
రాజాబాయి (60) అనే వృద్ధురాలి నాయకత్వంలో నిలబాయి (45), పల్లవి (22), రాధిక (35), గంగా (20), సరిత (20) అనే మహిళలు లారీ డ్రైవర్లే టార్గెట్ గా హైవేలపై లూటీలకు పాల్పడుతుంటారు. ఏదేనీ చెక్ పోస్టు లేదా టోల్ గేట్ వద్ద లారీ ఆగిఉన్న సమయంలో రాజాబాయి ఎంట్రీ ఇస్తుంది. ఇద్దరు డ్రైవర్లున్న బండివైపు చస్తే వెళ్లదు. వాళ్ల టార్గెట్ మొత్తం సింగిల్ గా బండి నడిపే డ్రైవర్లే. 'అయ్యా.. ముసలిదాన్ని చేతకావట్లేదు. కొద్దిగా అక్కడ దిగబెట్టవూ' అని మాటకలిపి లారీ ఎక్కి కూర్చుంటుంది. కొద్ది దూరం ప్రయాణించాక ముఠాలో కాస్త అందంగా ఉండే మరో ఇద్దరు తారాసపడతారు. వాళ్లూ లారీలో ఎక్కి కూర్చున్నతర్వాత అసలు సినిమా మొదలవుతుంది.
ప్రయాణంలో కుదుపులు, ఊపులకు తగ్గట్లు చూపులు, కదలికలతో డ్రైవర్ ను కవ్విస్తారు. అప్పుడు రాజాబాబు కలుగజేసుకుని ఆ అమ్మాయిలతో వ్యవహారం నేను సెటిల్ చేస్తానని డ్రైవర్ ను నమ్మిస్తుంది. అలా అందరూ కలిసి నిర్జన ప్రదేశానికి వెళతారు. అంతే.. కత్తులు.. అగ్గిరవ్వలతో డ్రైవర్ ను చుట్టుముడతారు బందిపోటు సిబ్బంది సభ్యులందరూ. ప్రాణం దక్కితే చాలనుకునే డ్రైవర్లు తమ దగ్గరున్న డబ్బు, నగలు, మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులు అన్నీ ఆ మహిళలకు సమర్పించుకుని పారిపోతారు. ఇలా దోపిడీకి గురవుతున్నవారి సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు.. వలపన్ని మహిళా బందిపోటు ముఠాను పట్టుకోగలిగారు. ప్రస్తుతం ఆ ఆరుగురూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.