
'సైకో అని ఒప్పుకో'
ఉండి: తనను పోలీసులు అదుపులోకి తీసుకుని సైకోగా ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారంటూ ఓ వ్యక్తి ఆరోపించాడు. బాధితుడి కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరకువాడకు చెందిన గాలి లాజర్ (30)ను నర్సాపురం డీఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వరుస సూది దాడులతో సైకో కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో లాజర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం తెల్లవారుజామున విడుదల చేశారు. అయితే, 'సైకో అని ఒప్పుకో' అంటూ పోలీసులు తనపై ఒత్తిడి తీసుకొచ్చారని లాజర్ ఆరోపించాడు. తనను వేధించిన పోలీసులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు శనివారం మీడియాకు తెలిపారు.
కాగా, దీనిపై డీఎస్పీ సౌమ్యలతను ‘సాక్షి’ ప్రతినిధి ప్రశ్నించగా... సైకో కోసం గాలిస్తున్న క్రమంలో పోడూరు నుంచి ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా లాజర్‌ను తాము అదుపులోకి తీసుకుని విచారించిన మాట నిజమేనన్నారు. సూది దాడులకు అతడికి సంబంధం లేదని నిర్ధారించుకుని విడిచిపెట్టామని చెప్పారు. అంతేకానీ, అతడిని వేధించలేదని, కొట్టలేదని స్పష్టం చేశారు