అమెరికాలోని న్యూయార్క్ నగర వీధుల్లో భారీగా మంచు కురుస్తున్న దృశ్యం
మంచు తుపానుతో వణికిపోతున్న అగ్రరాజ్యం
18 మంది మృత్యువాత
వాషింగ్టన్/న్యూయార్క్: అమెరికా తూర్పు కోస్తా ప్రాంతం మొత్తం బలమైన ఈదురు గాలులు, మంచు తుపాను ధాటికి అల్లకల్లోలం అవుతోంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. మంచు తుపాను ధాటికి దాదాపు 18 మంది మృత్యువాత పడ్డారు. ‘స్నోజిల్లా’ అని పిలుస్తున్న ఈ మంచు తుపాను ప్రభావంతో అమెరికా పశ్చిమ ప్రాంతం మొత్తం స్తంభించిపోయింది. దాదాపు మూడు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. ఇప్పటికే దాదాపు 10 రాష్ట్రాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.
న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ వంటి ప్రధాన నగరాలు మంచు తుపానులో చిక్కుకోవడం దాదాపు 8.5 కోట్ల మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కూడా లేకపోవడంతో కొన్ని వేల మంది చీకట్లోనే గడుపుతున్నారు. వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. న్యూయార్క్ వంటి నగరాల్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయన్న కారణంతో ప్రజలు కార్లలో ప్రయాణించకూడదని ఆంక్షలు విధించింది. భూగర్భ మెట్రో రైలు సర్వీసులను రద్దు చేసింది. ఎమర్జెన్సీ వాహనాలు వెళ్లేందుకు రోడ్లపై పేరుకుపోయిన మంచును అధికారులు తొలగిస్తున్నారు. ఇంకో 24 గంటలు ఇదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు.