భారత ఎకానమీపై ఆనంద్ మహీంద్రా వ్యాఖ్య
న్యూఢిల్లీ: ఫండమెంటల్స్‌ని పక్కన పెట్టి భారత ఆర్థిక వ్యవస్థలో ప్రతికూల పరిస్థితుల గురించి మరీ అతిగా ప్రచారం జరిగిందని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) సీఎండీ ఆనంద్ మహీంద్రా చెప్పారు. అవసరమైన దానికన్నా ఎక్కువగా ఆందోళన నెలకొన్నప్పటికీ.. ప్రస్తుతం పరిస్థితి హేతుబద్ధ స్థాయికి వస్తోందని ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.
1991 తరహాలో భారత్ మరోసారి చెల్లింపుల సంక్షోభం ఎదుర్కొనవచ్చన్న ఆందోళనలను మహీంద్రా కొట్టిపారేశారు. అప్పట్లో భారత్‌వద్ద విదేశీ మారక నిల్వలు నెలరోజులకు కూడా సరిపడేంతగా లేవని, ప్రస్తుతం 280 బిలియన్ డాలర్ల మేర పుష్కలంగా ఉన్నాయన్నారు. దేశం కొంత అస్తవ్యస్త పరిస్థితి ఎదుర్కొన్న సంగతి వాస్తవమే అయినప్పటికీ.. మళ్లీ క్రమంగా వృద్ధిబాట పడుతోందని మహీంద్రా తెలిపారు. ఇందులో భాగంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మన జనాభాలో 50 శాతం మంది పాతికేళ్ల వయస్సు లోపువారే ఉన్నారని, తయారీ రంగమే పెద్ద యెత్తున ఉపాధి అవకాశాలు కల్పించగలదని మహీంద్రా చెప్పారు.