
నెటిజన్‌పై విరుచుకుపడ్డ టాప్ యాంకర్
హైదరాబాద్: సినీ పరిశ్రమలో ఉన్నవారికి ఆన్‌లైన్‌లో విమర్శలు, దూషణలు కొత్తకాదు. ముఖ్యంగా నటీమణులకు నిత్యం ఎక్కడోచోట ఏదోరకమైన విమర్శలు ఎదురవుతూనే ఉంటాయి. కొందరు తేలికగా తీసుకుంటే.. మరికొందరు స్పందిస్తూ ఉంటారు. తాజాగా టాప్ యాంకర్, సినీ నటి అనసూయ భరద్వాజ్‌కు కూడా ఇదేరకమైన అనుభవం ఎదురైంది. టీవీ షోల్లో ఆమె ధరిస్తున్న దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ నెటిజన్ ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టుపై కామెంట్ చేశాడు. దానికి అంతే ఘాటుగా అనసూయ బదులు ఇచ్చింది.
'అనుసూయ నీకు ఏమైనా సెన్స్ ఉందా? ఈ ఎక్స్‌పోజింగ్ ఏంటి? కుటుంబంతో కలిసి మేం టీవీ కార్యక్రమాలు చూడలేకపోతున్నాం' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. అనసూయ ఘాటుగా స్పందించింది. 'అప్పుడు నువ్వు చూడకుండా ఉండు. కుటుంబ విలువలపై నీకు అంతగా పట్టింపు ఉన్నప్పుడు నువ్వు ఇతరుల విషయాల్లో తలదూర్చకూడదు. ఇతరులు ఏం దుస్తులు వేసుకోవాలో నిర్దేశించకూడదు. ఒక మహిళ, అమ్మ, భార్య అయిన పబ్లిక్ ఫిగర్‌తో మాట్లాడే స్వేచ్ఛను నువ్వు తీసుకోకూడదు' అని పేర్కొంది.
'నేనేం చేయాలి? ఏ దుస్తులు వేసుకోవాలి అన్నది నా పని. నా అభీష్టం. ఇంద్రియాజ్ఞానం అనేది వ్యక్తి అదుపులో ఉంటుంది. ఏం చూడాలనుకుంటే అదే చూస్తారు. కానీ చూపించేది కాదు. అయినా, బాలికలపై లైంగిక వేధింపులు ఎందుకు జరుగుతున్నాయి? 65 ఏళ్ల వృద్ధ మహిళలపై అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? వారిలో ఏం 'ఎక్స్‌పోజింగ్' మీకు కనిపిస్తుంది? మేం వినోదాన్ని అందించేవాళ్లం. మా పరిమితులు, మేం చేస్తున్న పనేమిటో మాకు తెలుసు. ఇతరులకు హుకుంలు జారీచేసే ముందు నీ పనేంటో నువ్వు చూసుకో' అని అనసూయ పేర్కొంది.