హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటును పావు శాతం తగ్గించింది. ప్రస్తుతం 10.25 శాతంగా ఉన్న బేస్ రేటును 10 శాతానికి తగ్గించింది. ఈ తగ్గిన వడ్డీరేట్లు జూన్ 11 నుంచి అమల్లోకి వస్తాయని బ్యాంకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇదేవిధంగా బీఎమ్‌పీఎల్‌ఆర్ రేటును 14.5 శాతం నుంచి 14.25 శాతానికి తగ్గించింది. ఈ మేరకు తీసుకున్న రుణాలపై ఈఎంఐ భారం తగ్గనుంది.
ఇండియన్ బ్యాంక్ రుణ రేటు తగ్గింపు..
న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాంక్ కనీస రుణ రేటు(బేస్ రేట్)ను 0.30 శాతం తగ్గించింది. దీనితో ఈ రేటు 10.25 శాతం నుంచి 9.95 శాతానికి తగ్గింది. కొత్త రేటు జూన్ 8 నుంచీ అమల్లోకి వస్తుంది. దీనితో బేస్‌రేటుకు అనుసంధానమయ్యే గృహ, వాహన, విద్యా, వాణిజ్య రుణ రేట్లు తగ్గే అవకాశం ఉంది.
యూబీ డిపాజిట్ రేటు తగ్గింపు
కాగా రుణ రేటు తగ్గింపునకు సంకేతంగా భావించే డిపాజిట్ రేటు కోత నిర్ణయాన్ని యునెటైడ్ బ్యాంక్ (యూబీ) తీసుకుంది. పలు మెచ్యూరిటీలపై డిపాజిట్ రేట్లను పావుశాతం మేర తగ్గించినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడాది డిపాజిట్ రేటును 8 శాతానికి తగ్గించింది. ఏడాది పైన డిపాజిట్ రేటును 7.75 శాతానికి కుదించింది. తాజా రేట్లు జూన్ 8 నుంచీ అమల్లోకి వస్తాయని తెలిపింది. పీఎన్‌బీ, యాక్సిస్ బ్యాంక్‌లు బుధవారమే డిపాజిట్ రేట్లను తగ్గించాయి.
ఇదే దారిలో మరికొన్ని బ్యాంకులు... రిజర్వ్ బ్యాంక్ జూన్ 2 రెపో రేటు కోత నేపథ్యంలో పలు బ్యాంకులు డిపాజిట్ రేట్ల కోత నిర్ణయం తీసుకుంటున్నాయి. జూన్ 2నే ఐడీబీఐ బ్యాంక్ డిపాజిట్ రేట్లను తగ్గించింది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలహాబాద్ బ్యాంక్, దేనాబ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లూ జూన్ 2నే కనీస రుణ రేటును తగ్గించాయి. పోటీ పూర్వక వాతావరణం నేపథ్యంలో మరిన్ని బ్యాంకులు సైతం రుణ, డిపాజిట్ రేట్ల తగ్గింపు దశలో నిర్ణయం తీసుకుంటాయని భావిస్తున్నారు.
ఆంధ్రాబ్యాంక్ బేస్ రేటు పావు శాతం కట్
Published Fri, Jun 5 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM
Advertisement