
గవర్నర్ సమక్షంలో మంత్రుల భేటీ
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించి సమస్యలను పరిష్కరించుకునేందుకు గురువారం రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ సభ్యులు రాజ్‌భవన్ లో భేటీ అయ్యారు. గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టానికి లోబడి ఉద్యోగుల విభజన, భవనాల అప్పగింత, తొమ్మిది, పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజన... తదితర అంశాలపై చర్చించారు. ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు, తెలంగాణ మంత్రి హరీశ్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
గవర్నర్ సూచనల మేరకు ఇరు రాష్ట్రాల్లోని విభజన సమస్యలపై చర్చించుకుని పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఈనెల 1న గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల మంత్రులు సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించినప్పటికీ పరిష్కారం కొలిక్కిరాకపోవడంతో ఈరోజు మరోసారి సమావేశమయ్యారు. సమస్యలపై కోర్టులను ఆశ్రయించి సాగదీసుకోకుండా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని నిర్ణయించినట్టు ఇరు రాష్ట్రాల మంత్రులు నిర్ణయించినట్టు తెలుస్తోంది.