చంద్రబాబే ప్రత్యేక హోదాకు అడ్డు | ANI news agency Interviews with ys Jagan | Sakshi
Sakshi News home page

చంద్రబాబే ప్రత్యేక హోదాకు అడ్డు

Published Fri, Oct 16 2015 3:58 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

చంద్రబాబే ప్రత్యేక హోదాకు అడ్డు - Sakshi

* ఏఎన్‌ఐ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
* ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన బాబు
* దాన్నుంచి బైటపడడం కోసమే హోదాపై ఒత్తిడి తేవడం లేదు
* విభజన చట్టంలో హామీలకే ప్యాకేజీ పేరు
* హోదా నిరాకరిస్తూ మోసం చేస్తున్నారు...
* మా పోరాటం ఆపేది లేదు..
హైదరాబాద్: పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలు కాకపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు దాన్నుంచి బైటపడడం కోసం ప్రత్యేక హోదా అంశాన్ని ఫణంగా పెట్టారని జగన్ విమర్శించారు.  విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాతోనే సాంత్వన కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. గురువారం నాడు జగన్‌మోహన్‌రెడ్డి ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రత్యేక హోదా కోరుతూ ఏడు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష, ఆసుపత్రిలో చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన తొలిసారిగా మాట్లాడారు.

ఇంటర్వ్యూ వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘నిరవధిక నిరాహార దీక్ష ఎందుకు చేశాం? ఈ దీక్షకు కారణాలున్నాయి. పార్లమెంటు సాక్షిగా ఆనాడు అధికార పక్షం, మొత్తం ప్రతిపక్షం ఏకమయ్యాయి. విభజనకు అనుకూలంగా ఓటేశాయి. పార్లమెంటు వేదికగా ఆనాడు ప్రత్యేక హోదాకు అన్ని పక్షాలు హామీ ఇచ్చాయి. ఇవాళ అవే పక్షాలు మాట తప్పుతున్నాయి. అలాంటపుడు ఇక పార్లమెంటుకు విశ్వసనీయత ఎక్కడుంటుంది? మేం అడుగుతున్న మౌలికమైన ప్రశ్న ఇది.  రాష్ర్టవిభజనతో హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టపోతోంది.

ఎందుకంటే హైదరాబాద్ నుంచే 60శాతం ఆదాయం వస్తుంది. 95శాతానికి పైగా సాఫ్ట్‌వేర్ సంస్థలు, 70శాతానికి పైగా మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. వాటిలో ఉపాథి అవకాశాలు కూడా కోల్పోయాం. వీటన్నిటినీ కోల్పోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. అయితే ఇపుడు దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదు. ఇపుడు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారు. ఇదేమి న్యాయమో అర్ధం కావడం లేదు. రాష్ర్ట విభజన సమయంలో అనేక హామీలు ఇచ్చారు. పోలవరం నిర్మిస్తామన్నారు.

రాజధాని నిర్మాణానికి డబ్బు ఇస్తామన్నారు. కేంద్రసంస్థలను ఇస్తామన్నారు. ఎయిర్‌పోర్టులు కడతామన్నారు.. ఇలా అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీలన్నీ విభజన చట్టంలోనే ఉన్నాయి. ఇపుడు అందరూ మాటమారుస్తున్నారు. ఆ హామీలకే కొత్త పేరు పెడుతున్నారు. దానికి ప్రత్యేక ప్యాకేజీ అనే కొత్త పేరు తగిలించారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒక పక్క ప్రత్యేక హోదాను నిరాకరిస్తూ మరో పక్క అబద్దాలాడుతూ మోసం చేస్తున్నారు. విభజన చట్టంలో హామీ ఇచ్చిన వాటికే కొత్తగా ప్రత్యేక ప్యాకేజీ అనే పేరు పెట్టడం మోసగించడమే. మాకు ఆకాంక్ష ఉంది. మేం పోరాడతాం. మా దురదృష్టమేమిటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పోరాడడం లేదు.

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వంపై రాష్ర్ట ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. కానీ చంద్రబాబు  కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు వత్తిడి చేయడం లేదు? ఇప్పటికి 18 నెలలు గడచిపోయాయి. ఇప్పటికీ చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం లేదు. ఒకనెల గడువిస్తున్నా.. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మా మంత్రులను కేంద్రం నుంచి ఉపసంహరిస్తా అని చంద్రబాబు ఎందుకు అల్టిమేటమ్ ఇవ్వడం లేదు.

చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఎందుకంటే ఆయన ఓటుకు కోట్లు కేసులో ఆడియోటేపులతో సహా అడ్డంగా దొరికిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో అనేక కుంభకోణాలలో సంపాదించిన డబ్బును తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తూ ఆయన దొరికిపోయారు. ఆ కేసునుంచి బైటపడడం కోసమే ఆయన హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదు’’.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement