రూ.2000 నోట్లపై సరికొత్త వివాదం
కోల్‌కతా: రిజర్వ్ బ్యాంక్ కొత్తగా విడుదల చేసిన రూ.2000 నోటుపై ఇప్పటికే వెలుగుచూసిన వాటికి తోడు సరికొత్త వివాదం చెలరేగింది. కొత్త నోటుపై జాతీయ మృగం బెంగాల్ టైగర్ బొమ్మకు చోటు కల్పించకపోవడాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుపడుతున్నారు. ఆర్బీఐ ముద్రించే అన్ని రకాల కరెన్సీ నోట్లపై బెంగాల్ టైగర్ బొమ్మ ఉంటుందని, అయితే కొత్తగా తీసుకొచ్చిన రూ.2000 నోటుపై మాత్రం దానికి చోటు కల్పించలేదన్న ఆమె.. మోదీ సర్కారు దురుద్దేశపూరితంగానే ఈ పనిచేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు.
‘రాయల్ బెంగాల్ టైగర్ గురించి, సుందర్బన్ సౌందర్యం గురించి ప్రపంచమంతటికీ తెలుసు. బెంగాల్ పులి మన జాతీయ జంతువు. అందుకే ఆర్బీఐ ముద్రించే అన్ని నోట్లపై ఆ బొమ్మ ఉంటుంది. కొత్త రూ.2000 నోటుపై మాత్రం ఏనుగు, నెమలి, కమలం బొమ్మలున్నాయి. ఏనుగు మన జాతీయ సంపద, కమలం జాతీయ పుష్పం, నెమలి జాతీయ పక్షి కాబట్టి వాటికి చోటుకల్పించడం సబబే కానీ జాతీయ జంతువు పులి బొమ్మను ఎందుకు తొలగించినట్లు? ఈ ప్రశ్నకు మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే’అని మమత బెనర్జీ అన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయంతో పేద, మధ్యతరగతి వర్గాల జీవితాలు అతలాకుతలం అయ్యాయన్న మమత.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తొలిసారి కొత్త నోట్లపై మాట్లాడిన ఆమె సరికొత్త వివాదానికి తెరలేపారు.
కొత్త 2000 నోటులో ఒకవైపు జాతిపిత మహాత్మా గాంధీ, రెండోవైపు మంగళ్‌యాన్ బొమ్మలు ప్రధానంగా కనిపిస్తాయి. వీటితోపాటు స్వచ్ఛభారత్ లోగో, ఏనుగు, నెమలి, కమలం పువ్వు బొమ్మలను కూడా కనిపిస్తాయి. ఈ వరుసలో జాతీయ జంతువుకు చోటుదక్కలేదు. కానీ రిజర్వ్ బ్యాంక్ లోగోపై కనిపించే పులి బొమ్మ ఉంటుంది. జంతువుల జాబితాలో పులిని చేర్చకపోవడంపై ఆర్బీఐ, ప్రభుత్వ వర్గాల నుంచి సమాధానం వెలవడాల్సిఉంది.