
భారత్ మార్కెట్లోకి యాపిల్ ఐఫోన్ 5ఎస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రే మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 5ఎస్ గోల్డ్ కలర్ మోడల్ హవా నడుస్తోంది. ఎంతగా అంటే.. రూ.53,500 ఖరీదున్న ఫోన్‌ను రూ.1.2 లక్షలు వెచ్చించడమేకాదు, అదీ భారత్‌లో విడుదల కాకముందే చేజిక్కించుకునేంతగా. దీనికంతటికీ కారణమేమంటే ఆపిల్ తొలిసారిగా బంగారు వర్ణంలో ఐఫోన్ 5ఎస్‌ను పరిచయం చేయడమే. సహజంగానే ఆపిల్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది. అందరూ ఈ కలర్ ఫోన్‌కే ఎగబడడంతో కొరత ఏర్పడింది. ఇంకేముంది గోల్డ్ మేనియాకు పెట్టింది పేరైన మన దేశంలోనూ డిమాండ్ ఊహించనంతగా ఉంది. దీంతో రెండింతల ధర వెచ్చించేందుకూ ఐఫోన్ అభిమానులు వెనుకాడడం లేదు. అంతర్జాతీయంగా నెలన్నర క్రితం కొత్త మోడళ్లు విడుదలయ్యాయి. విడుదలైన మూడు రోజులకే గ్రే మార్కెట్లో ఉత్తరాదికి చెందిన ఒక కస్టమర్ రూ.1.2 లక్షలు వెచ్చించి గోల్డ్ కలర్ ఫోన్‌ను కైవసం చేసుకున్నాడట. సిమెంటు వ్యాపారంలో ఉన్న హైదరాబాద్ యువ వ్యాపారి ఒకరు రూ.1 లక్ష చెల్లించినట్టు సమాచారం.
సరఫరా 200 పీసులే..: ఆపిల్ భారత్‌లో అధికారికంగా నవంబర్ 1న ఐఫోన్ 5ఎస్, 5సీ మోడళ్లను దేశవ్యాప్తంగా విడుదల చేసింది. ఐఫోన్ 5ఎస్ ధర 16 జీబీ మోడల్ రూ.53,500, 32 జీబీ రూ.62,500, 64 జీబీ రూ.71,500 ఉంది. అలాగే ఐఫోన్ 5సీ 16 జీబీ రూ.41,900 కాగా, 32 జీబీ రూ.53,500గా నిర్ణయించింది. గోల్డ్, సిల్వర్(వైట్), స్పేస్ గ్రే(బ్లాక్) రంగుల్లో ఐఫోన్ 5ఎస్ రూపొందింది. బ్లూ, గ్రీన్, పింక్, యెల్లో, వైట్ రంగుల్లో ఐఫోన్ 5సీ లభిస్తోంది. వైట్ మినహా మిగిలిన రంగులన్నీ ఆపిల్ తొలిసారిగా విడుదల చేసినవే. అయితే భారత్‌కు సరఫరా అయిన గోల్డ్ కలర్ 5ఎస్ ఫోన్ల సంఖ్య 200 మాత్రమేనని విశ్వసనీయ సమాచారం. ఐఫోన్ కొత్త మోడళ్ల డిమాండ్ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 10 వేల పీసులుంటుందని ఒక రిటైలర్ తెలిపారు. 30 శాతం మంది గోల్డ్ కలర్‌నే కోరుకుంటున్నారు. ఆ తర్వాతి స్థానం స్పేస్ గ్రే(బ్లాక్), సిల్వర్(వైట్) రంగులది.
ఆర్‌కాం ప్రత్యేక ఆఫర్..: రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్‌కాం) ఐఫోన్ కస్టమర్ల కోసం నెలవారీ వాయిదా పథకాన్ని ప్రకటించింది. కాల పరిమితి 24 నెలలు. లోకల్, ఎస్టీడీ కాల్స్, ఎస్‌ఎంఎస్ అపరిమితం. నేషనల్ రోమింగ్ ఉచితం. 3జీ డేటా అపరిమితంగా వినియోగించుకోవచ్చు. 16 జీబీ ఐఫోన్ 5సీ, 5ఎస్‌ను ఎలాంటి డౌన్ పేమెంట్ లేకుండా అందిస్తోంది. నెలవారీ వాయిదా 5సీ మోడళ్లు అయితే రూ.2,599, 5ఎస్ మోడళ్లు రూ.2,999.