ఎస్‌బీఐ కొత్త చీఫ్ అరుంధతీ భట్టాచార్య | Arundhati Bhattacharya becomes first woman to head SBI | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ కొత్త చీఫ్ అరుంధతీ భట్టాచార్య

Published Tue, Oct 8 2013 12:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:26 PM

ఎస్‌బీఐ కొత్త చీఫ్ అరుంధతీ భట్టాచార్య

ఎస్‌బీఐ కొత్త చీఫ్ అరుంధతీ భట్టాచార్య

ముంబై: భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)  చైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య నియమితులయ్యారు. ఆమె సోమవారం ఈ బాధ్యతలను స్వీకరించినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. మూడేళ్లపాటు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. బ్యాంక్ 207 సంవత్సరాల చరిత్రలో ఒక మహిళ ఈ అత్యున్నత స్థాయి బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఆమె ఎస్‌బీఐ మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ), చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
 
 బ్యాంక్ మొత్తం నలుగురు ఎండీలలో రిటైర్‌మెంట్‌కు ఇంకా రెండేళ్లకుపైగా సర్వీస్ కలిగి ఉండడం 57ఏళ్ల అరుంధతీ భట్టాచార్య నియామకానికి కలిసి వచ్చిన అంశం.  ప్రతీప్ చౌదరి గత నెల 30వ తేదీన పదవీ విరమణ చేయడంతో ఈ స్థానానికి అరుంధతీ భట్టాచార్య మొదటి స్థానంలో నిలిచారు. ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ టక్రూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఆనంద్ శర్మలతో కూడిన  నియామక కమిటీ ఎస్‌బీఐ టాప్ జాబ్‌కు అరుంధతీ భట్టాచార్య పేరును గత నెల్లో ఖరారు చేసింది. తదనంతరం ప్రధాని నేతృత్వంలోని నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమె పేరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అరుంధతీ భట్టాచార్య ప్రమోషన్‌తో బ్యాంక్ నలుగురు ఎండీలలో ఒక స్థానం ఖాళీ అయ్యింది. బ్యాంక్‌లో డజనుకుపైగా డిప్యూటీ ఎండీలు, 35కుపైగా చీఫ్ జనరల్ మేనేజర్లు (సీజీఎంలు) పనిచేస్తున్నారు.
 
 అపార అనుభవం...
 బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం అరుంధతీ భట్టాచార్య సొంతం. 1977లో ఎస్‌బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా ఆమె చేరారు. రిటైల్, ట్రెజరీ, కార్పొరేట్ ఫైనాన్స్ వంటి పలు కీలక బాధ్యతలను 36 సంవత్సరాల తన కెరీర్‌లో నిర్వహించారు. డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్, కార్పొరేట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, చీఫ్ జనరల్ మేనేజర్ (బెంగళూరు సర్కిల్) మర్చంట్ బ్యాంకింగ్ విభాగం (ఎస్‌బీఐ క్యాపిటల్) చీఫ్ వంటి ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహించారు. జనరల్ ఇన్సూరెన్స్, కస్టడీ సర్వీసెస్, ఎస్‌బీఐ మెక్వైరీ ఇన్‌ఫ్రా ఫండ్ సబ్సిడరీస్ వంటి విభాగాల ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించారు. బ్యాంక్ న్యూయార్క్ ఆఫీస్ ఎక్స్‌టర్నల్ ఆడిట్, కరస్పాండెంట్ రిలేషన్స్ చీఫ్‌గా కూడా ఆమె బాధ్యతలు నిర్వహించారు.
 
 ఎస్‌బీఐ చరిత్ర క్లుప్తంగా...
 బ్రిటిష్ పాలనా కాలంలో ఎస్‌బీఐ మూలాలు ఉన్నాయి. 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తా ఏర్పాటయ్యింది. తరువాత 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబేను నెలకొల్పారు. 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఏర్పాటయ్యింది. 1921లో ఈ మూడు బ్యాంకుల విలీనంతో కలకత్తా కేంద్రంగా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను బ్రిటిషర్లు ఏర్పాటు చేశారు. ఈ బ్యాంకును 1955లో నెహ్రూ ప్రభుత్వం జాతీయీకరణ చేసింది. ఇంపీరియల్ బ్యాంక్ పేరును పార్లమెంటులో చట్టం ద్వారా  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ప్రస్తుతం ఎస్‌బీఐ ప్రపంచంలో అతిపెద్ద 66వ బ్యాంక్. దేశంలోని మొత్తం బ్యాంకింగ్ అసెట్స్‌లో ఎస్‌బీఐ, దాని ఐదు అనుబంధ బ్యాంకులు 20 శాతం పైగా వాటాను కలిగి ఉన్నాయి.
 
 బ్యాం‘క్వీన్స్’
 ‘భారతీయ మహిళా బ్యాంక్’ పేరుతో కేవలం మహిళల కోసం మొదటి బ్యాంక్‌ను కేంద్రం ఏర్పాటు చేస్తున్న తరుణంలోనే అరుంధతీ భట్టాచార్యకు బ్యాంకింగ్ రంగంలో అత్యున్నత స్థానం దక్కడం విశేషం.  ప్రస్తుతం దేశంలో అగ్రస్థాయి బ్యాంకులన్నింటికీ మహిళలే సారథ్యం వహించడం మరో కీలకాంశం.
 
 అలహాబాద్ బ్యాంక్-    శుభలక్ష్మి పన్సే
 బ్యాంక్ ఆఫ్ ఇండియా-    విజయలక్ష్మి అయ్యర్
 యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-    అర్చనా భార్గవ్
 ఐసీఐసీఐ-    చందా కొచర్
 యాక్సిస్ బ్యాంక్-    శిఖా శర్మ
 హెచ్‌ఎస్‌బీసీ ఇండియా-నైనాలాల్ కిద్వాయ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement