Pratip Chaudhuri
-
ఒక్కో ఏటీఎంలో రూ.కోటి ఎందుకు పెట్టరు?
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశ కేంద్ర బ్యాంక్ ఆర్ బీఐ పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ ప్రతీప్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో ఆయన రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నగదు పరిస్థితి గురించి ప్రజలకు అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. దేశంలో తీవ్రమైన నగదు కొరత ఉందన్నారు. డీమానిటైజేషన్ మొత్తం ప్రక్రియలో ఆర్ బీఐ పారదర్శకంగా వుండాలని వ్యాఖ్యానించారు. అయితే ఏదైనా సమస్య ఉంటే నిష్పాక్షికంగా ప్రకటించడానికి బదులు వాస్తవాలను దాచి పెడుతూ పారిపోతోందని విమర్శించారు. నల్లధనాన్ని అరికట్టడానికి దేశం తీసుకున్న నోట్ల రద్దు సరైంది కాదని ప్రతీప్ వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియతో నకిలీ నగదును కొంత మేరకు అరికట్టే అవకాశం ఉంది తప్ప నల్లధనాన్ని నిరోధించడం సాధ్యం కాదన్నారు. అంతేకాదు పెద్ద నోట్ల రద్దు సంక్షోభంతో నగదు పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి కనీసం మరో మూడు నెలల పడుతుందన్నారు. దేశంలో ద్రవ్య వినియోగం తీవ్రంగా దెబ్బతినడంతో ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై శాశ్వతంగా ఉంటుందని చౌదరి తెలిపారు. సరిపడినంత నగదు ఉందని ఆర్ బీపై హామీ ఇస్తోంది కదా అని ప్రశ్నించినపుడు అది అంతా అబద్ధమని కొట్టి పారేశారు. నిజంగా తగినంత సొమ్ము ఉంటే, దేశంలోని 2 లక్షల ఏటీఎంలలో ఒక్కో దానిలో కోటి రూపాయలు ఎందుకు అందుబాటులోకి తేవడం లేదనీ , ప్రతి ఖాతాదారుడు రూ .5,000 లేదా రూ 10,000 డ్రా చేసుకోమని ఎందుకు చెప్పలేకపోతోందని ఆయన ప్రశ్నించారు. అలాగే ఇటీవల నగదు విత్ డ్రా పరిమితిని రోజుకు రూ.4500 పెంచినా ఒకటి రెండు ఏటీఎంలు అలా పనిచేయడపోవడమే ఇందుకు తార్కాణమని తెలిపారు. జరుగుతున్న పరిణామాల్లో ఆర్ బీఐ నిశ్శబ్ద ప్రేక్షకుడులా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు. నిజానికి, ఆర్బిఐ మంటల్ని ఆర్చే ఫైర్ మ్యాన్ లా వ్యవహరించాలి. నీళ్ళు చల్లి మంటల్ని అదుపు చేయాలి. కానీ దీనికి విరుద్ధంగా ఆర్ బీఐ పారిపోతోందంటూ ఘాటుగా విమర్శించారు. ప్రతీ దేశం పాత కరెన్సీని రద్దు చేసింది. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుందని వ్యాఖ్యానించారు. చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని రద్దు చేయడం సరైన నిర్ణయం కాదనీ, ఇది నకిలీ కరెన్సీని అడ్డుకోవడానికి పాక్షికంగా ఉపయోగపడుతుంది తప్ప నల్లధనాన్ని నిరోధించలేదని చెప్పారు. ఏ దేశమూ ఇలా చేయలేదని పేర్కొన్నారు. నోట్ల రద్దు పర్యవసానాల్ని అంచనా వేయడంలో, తగిన చర్యల్ని తీసుకోవడం కేంద్రం విఫలమైందని అనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. -
ఎస్బీఐ కొత్త చీఫ్ అరుంధతీ భట్టాచార్య
ముంబై: భారత బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య నియమితులయ్యారు. ఆమె సోమవారం ఈ బాధ్యతలను స్వీకరించినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. మూడేళ్లపాటు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. బ్యాంక్ 207 సంవత్సరాల చరిత్రలో ఒక మహిళ ఈ అత్యున్నత స్థాయి బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఆమె ఎస్బీఐ మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ), చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. బ్యాంక్ మొత్తం నలుగురు ఎండీలలో రిటైర్మెంట్కు ఇంకా రెండేళ్లకుపైగా సర్వీస్ కలిగి ఉండడం 57ఏళ్ల అరుంధతీ భట్టాచార్య నియామకానికి కలిసి వచ్చిన అంశం. ప్రతీప్ చౌదరి గత నెల 30వ తేదీన పదవీ విరమణ చేయడంతో ఈ స్థానానికి అరుంధతీ భట్టాచార్య మొదటి స్థానంలో నిలిచారు. ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ టక్రూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ ఆనంద్ శర్మలతో కూడిన నియామక కమిటీ ఎస్బీఐ టాప్ జాబ్‌కు అరుంధతీ భట్టాచార్య పేరును గత నెల్లో ఖరారు చేసింది. తదనంతరం ప్రధాని నేతృత్వంలోని నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమె పేరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అరుంధతీ భట్టాచార్య ప్రమోషన్‌తో బ్యాంక్ నలుగురు ఎండీలలో ఒక స్థానం ఖాళీ అయ్యింది. బ్యాంక్‌లో డజనుకుపైగా డిప్యూటీ ఎండీలు, 35కుపైగా చీఫ్ జనరల్ మేనేజర్లు (సీజీఎంలు) పనిచేస్తున్నారు. అపార అనుభవం... బ్యాంకింగ్ రంగంలో అపార అనుభవం అరుంధతీ భట్టాచార్య సొంతం. 1977లో ఎస్బీఐలో ప్రొబెషనరీ ఆఫీసర్‌గా ఆమె చేరారు. రిటైల్, ట్రెజరీ, కార్పొరేట్ ఫైనాన్స్ వంటి పలు కీలక బాధ్యతలను 36 సంవత్సరాల తన కెరీర్లో నిర్వహించారు. డిప్యూటీ మేనేజింగ్ డెరైక్టర్, కార్పొరేట్ డెవలప్మెంట్ ఆఫీసర్, చీఫ్ జనరల్ మేనేజర్ (బెంగళూరు సర్కిల్) మర్చంట్ బ్యాంకింగ్ విభాగం (ఎస్బీఐ క్యాపిటల్) చీఫ్ వంటి ఉన్నత స్థాయి బాధ్యతలు నిర్వహించారు. జనరల్ ఇన్సూరెన్స్, కస్టడీ సర్వీసెస్, ఎస్బీఐ మెక్వైరీ ఇన్ఫ్రా ఫండ్ సబ్సిడరీస్ వంటి విభాగాల ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించారు. బ్యాంక్ న్యూయార్క్ ఆఫీస్ ఎక్స్టర్నల్ ఆడిట్, కరస్పాండెంట్ రిలేషన్స్ చీఫ్‌గా కూడా ఆమె బాధ్యతలు నిర్వహించారు. ఎస్బీఐ చరిత్ర క్లుప్తంగా... బ్రిటిష్ పాలనా కాలంలో ఎస్బీఐ మూలాలు ఉన్నాయి. 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తా ఏర్పాటయ్యింది. తరువాత 1840లో బ్యాంక్ ఆఫ్ బాంబేను నెలకొల్పారు. 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్ ఏర్పాటయ్యింది. 1921లో ఈ మూడు బ్యాంకుల విలీనంతో కలకత్తా కేంద్రంగా ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను బ్రిటిషర్లు ఏర్పాటు చేశారు. ఈ బ్యాంకును 1955లో నెహ్రూ ప్రభుత్వం జాతీయీకరణ చేసింది. ఇంపీరియల్ బ్యాంక్ పేరును పార్లమెంటులో చట్టం ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ప్రస్తుతం ఎస్బీఐ ప్రపంచంలో అతిపెద్ద 66వ బ్యాంక్. దేశంలోని మొత్తం బ్యాంకింగ్ అసెట్స్‌లో ఎస్బీఐ, దాని ఐదు అనుబంధ బ్యాంకులు 20 శాతం పైగా వాటాను కలిగి ఉన్నాయి. బ్యాం‘క్వీన్స్’ ‘భారతీయ మహిళా బ్యాంక్’ పేరుతో కేవలం మహిళల కోసం మొదటి బ్యాంక్‌ను కేంద్రం ఏర్పాటు చేస్తున్న తరుణంలోనే అరుంధతీ భట్టాచార్యకు బ్యాంకింగ్ రంగంలో అత్యున్నత స్థానం దక్కడం విశేషం. ప్రస్తుతం దేశంలో అగ్రస్థాయి బ్యాంకులన్నింటికీ మహిళలే సారథ్యం వహించడం మరో కీలకాంశం. అలహాబాద్ బ్యాంక్- శుభలక్ష్మి పన్సే బ్యాంక్ ఆఫ్ ఇండియా- విజయలక్ష్మి అయ్యర్ యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- అర్చనా భార్గవ్ ఐసీఐసీఐ- చందా కొచర్ యాక్సిస్ బ్యాంక్- శిఖా శర్మ హెచ్ఎస్బీసీ ఇండియా-నైనాలాల్ కిద్వాయ్ -
విలీనాల ఆలస్యానికి నిబంధనలే కారణం
ముంబై: బాసెల్-3 నిబంధనలు అమలు చే యడానికి భారీగా మూల ధనం అవసరం కావడంతో అనుబంధ బ్యాం కులను విలీనం చేసుకోలేకపోయామని ఎస్బీఐ తాజా మాజీ చైర్మన్ ప్రతీప్ చౌదరి పేర్కొన్నారు. అనుబంధ బ్యాం కుల విలీనానికి బాసెల్-3 నిబంధనలే అడ్డం కిగా మారాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అనుబంధ బ్యాంకును విలీనం చేసుకునే శక్తి ఎస్బీఐకి ఉందన్నారు. విలీనం తరువాత ఆ బ్యాంకు సిబ్బంది జీతాలు భారీగా పెరుగుతాయని, ఇది బ్యాంకుకు అదనపు భారమన్నారు. -
వడ్డీ రేట్లు తగ్గించాలి: బ్యాంకర్లు
న్యూఢిల్లీ: ఈ పండుగ సీజన్ సందర్భంగానైనా వడ్డీ రేట్లను తగ్గించడంపైనా, ద్రవ్య లభ్యతను పెంచడంపైనా రిజర్వ్ బ్యాంక్ దృష్టి సారించాలని బ్యాంకర్లు అభిప్రాయపడ్డారు. తద్వారా తయారీ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగేలా, వృద్ధికి ఊతమిచ్చేలా చూడాలని పేర్కొన్నారు. ఈ నెల 20న రిజర్వ్ బ్యాంక్ మధ్యంతర త్రైమాసిక పరపతి విధాన సమీక్షను ప్రకటించనున్న నేపథ్యంలో బ్యాంకర్ల సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ద్రవ్య లభ్యత మరింత పెరిగేలా, వడ్డీ రేట్లు తగ్గేలా చూడాలని ఆర్బీఐకి తాము సిఫార్సు చేసినట్లు ఎస్బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి చెప్పారు. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్), రెపో రేటును తగ్గించాలని కోరినట్లు పేర్కొన్నారు. లిక్విడిటీని కఠినతరం చేయడం వల్ల రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయగలిగితే వేయొచ్చు గానీ.. దీని వల్ల ఎకానమీ వృద్ధిపరమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని చౌదరి వ్యాఖ్యానించారు. మరోవైపు, రుణాలు మరింత చవకయ్యేలా ఆర్బీఐ కఠిన పరపతి విధానాన్ని సడలించాలని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఎండీ ఎం. నరేంద్ర చెప్పా రు. పండుగల సీజన్ సందర్భంగా రుణాలకు డిమాండ్ పెరుగుతుందని, ఆర్బీఐ గానీ పాలసీ రేట్లను తగ్గిస్తే.. బ్యాంకులు మరింత తక్కువ వడ్డీ రేటుకి రుణాలు అందించడం సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. ద్రవ్య లభ్యతను పెంచేందుకు ఆర్ బీఐ చర్యలు తీసుకోగలదని ఆశిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ పి. శ్రీనివాస్ చెప్పారు. ద్రవ్యోల్బణం, రూపాయి కట్టడి కోసం ఆర్బీఐ కొన్నాళ్లుగా కఠిన పరపతి విధానాన్ని అనుసరిస్తోంది. ఇందులో భాగంగా జూలై 29న జరిగిన పాలసీ సమీక్షలో ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగానే ఉంచిన సంగతి తెలిసిందే. -
వడ్డీ రేట్లను పెంచే యోచన లేదు: ఎస్బీఐ
ముంబై: ఇటీవల బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా పెంచిన ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్బీఐ) తాజాగా రుణాలపై వడ్డీ రేట్లను పెంచే యోచనేదీ లేదని స్పష్టం చేసింది. అయితే రిజర్వ్ బ్యాంకు చేపట్టిన లిక్విడిటీ కట్టడి చర్యల నేపథ్యంలో నిధుల సమీక రణ వ్యయాలు పెరగడంతో పలు ప్రయివేట్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతానికి తాము రుణాలపై వడ్డీ రేట్లను పెంచేయోచనలో లేమని ఎస్బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదురి పేర్కొన్నారు. ఎస్బీఐ ఇటీవల బల్క్ డిపాజిట్లపై 1.5% వరకూ వడ్డీ రేట్లను పెంచిన నేపథ్యంలో బేస్ రేటును పెంచే విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చౌదురి ప్రస్తుతానికి అలాంటి ఆలోచనేదీ లేదంటూ స్పందించారు. లిక్విడిటీని తగ్గిస్తూ ఆర్బీఐ ఇటీవల తీసుకున్న చర్యల కారణంగా ప్రయివేట్ రంగ దిగ్గజాలు ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బేస్ రేట్లను పెంచిన విషయం విదితమే. కాగా, ఆర్థిక శాఖ నుంచి ఒత్తిళ్ల కారణంగానే ప్రభుత్వ బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచేందుకు వెనకాడుతున్నాయన్నది నిపుణుల మాట.