న్యూఢిల్లీ: ఈ పండుగ సీజన్ సందర్భంగానైనా వడ్డీ రేట్లను తగ్గించడంపైనా, ద్రవ్య లభ్యతను పెంచడంపైనా రిజర్వ్ బ్యాంక్ దృష్టి సారించాలని బ్యాంకర్లు అభిప్రాయపడ్డారు. తద్వారా తయారీ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగేలా, వృద్ధికి ఊతమిచ్చేలా చూడాలని పేర్కొన్నారు. ఈ నెల 20న రిజర్వ్ బ్యాంక్ మధ్యంతర త్రైమాసిక పరపతి విధాన సమీక్షను ప్రకటించనున్న నేపథ్యంలో బ్యాంకర్ల సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ద్రవ్య లభ్యత మరింత పెరిగేలా, వడ్డీ రేట్లు తగ్గేలా చూడాలని ఆర్‌బీఐకి తాము సిఫార్సు చేసినట్లు ఎస్‌బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదరి చెప్పారు. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్), రెపో రేటును తగ్గించాలని కోరినట్లు పేర్కొన్నారు. లిక్విడిటీని కఠినతరం చేయడం వల్ల రూపాయి పతనానికి అడ్డుకట్ట వేయగలిగితే వేయొచ్చు గానీ.. దీని వల్ల ఎకానమీ వృద్ధిపరమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని చౌదరి వ్యాఖ్యానించారు.
మరోవైపు, రుణాలు మరింత చవకయ్యేలా ఆర్‌బీఐ కఠిన పరపతి విధానాన్ని సడలించాలని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సీఎండీ ఎం. నరేంద్ర చెప్పా రు. పండుగల సీజన్ సందర్భంగా రుణాలకు డిమాండ్ పెరుగుతుందని, ఆర్‌బీఐ గానీ పాలసీ రేట్లను తగ్గిస్తే.. బ్యాంకులు మరింత తక్కువ వడ్డీ రేటుకి రుణాలు అందించడం సాధ్యపడుతుందని ఆయన పేర్కొన్నారు. ద్రవ్య లభ్యతను పెంచేందుకు ఆర్ బీఐ చర్యలు తీసుకోగలదని ఆశిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ పి. శ్రీనివాస్ చెప్పారు. ద్రవ్యోల్బణం, రూపాయి కట్టడి కోసం ఆర్‌బీఐ కొన్నాళ్లుగా కఠిన పరపతి విధానాన్ని అనుసరిస్తోంది. ఇందులో భాగంగా జూలై 29న జరిగిన పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ కీలక రేట్లను యథాతథంగానే ఉంచిన సంగతి తెలిసిందే.
వడ్డీ రేట్లు తగ్గించాలి: బ్యాంకర్లు
Published Wed, Sep 18 2013 1:58 AM | Last Updated on Fri, Sep 1 2017 10:48 PM
Advertisement