వడ్డీ రేట్లను పెంచే యోచన లేదు: ఎస్‌బీఐ
ముంబై: ఇటీవల బల్క్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా పెంచిన ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్‌బీఐ) తాజాగా రుణాలపై వడ్డీ రేట్లను పెంచే యోచనేదీ లేదని స్పష్టం చేసింది. అయితే రిజర్వ్ బ్యాంకు చేపట్టిన లిక్విడిటీ కట్టడి చర్యల నేపథ్యంలో నిధుల సమీక రణ వ్యయాలు పెరగడంతో పలు ప్రయివేట్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతానికి తాము రుణాలపై వడ్డీ రేట్లను పెంచేయోచనలో లేమని ఎస్‌బీఐ చైర్మన్ ప్రతీప్ చౌదురి పేర్కొన్నారు.
ఎస్‌బీఐ ఇటీవల బల్క్ డిపాజిట్లపై 1.5% వరకూ వడ్డీ రేట్లను పెంచిన నేపథ్యంలో బేస్ రేటును పెంచే విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చౌదురి ప్రస్తుతానికి అలాంటి ఆలోచనేదీ లేదంటూ స్పందించారు. లిక్విడిటీని తగ్గిస్తూ ఆర్‌బీఐ ఇటీవల తీసుకున్న చర్యల కారణంగా ప్రయివేట్ రంగ దిగ్గజాలు ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బేస్ రేట్లను పెంచిన విషయం విదితమే. కాగా, ఆర్థిక శాఖ నుంచి ఒత్తిళ్ల కారణంగానే ప్రభుత్వ బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచేందుకు వెనకాడుతున్నాయన్నది నిపుణుల మాట.