ఒక్కో ఏటీఎంలో రూ.కోటి ఎందుకు పెట్టరు?
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో దేశ కేంద్ర బ్యాంక్ ఆర్ బీఐ పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ ప్రతీప్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో ఆయన రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నగదు పరిస్థితి గురించి ప్రజలకు అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. దేశంలో తీవ్రమైన నగదు కొరత ఉందన్నారు. డీమానిటైజేషన్ మొత్తం ప్రక్రియలో ఆర్ బీఐ పారదర్శకంగా వుండాలని వ్యాఖ్యానించారు. అయితే ఏదైనా సమస్య ఉంటే నిష్పాక్షికంగా ప్రకటించడానికి బదులు వాస్తవాలను దాచి పెడుతూ పారిపోతోందని విమర్శించారు.
నల్లధనాన్ని అరికట్టడానికి దేశం తీసుకున్న నోట్ల రద్దు సరైంది కాదని ప్రతీప్ వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియతో నకిలీ నగదును కొంత మేరకు అరికట్టే అవకాశం ఉంది తప్ప నల్లధనాన్ని నిరోధించడం సాధ్యం కాదన్నారు. అంతేకాదు పెద్ద నోట్ల రద్దు సంక్షోభంతో నగదు పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి కనీసం మరో మూడు నెలల పడుతుందన్నారు. దేశంలో ద్రవ్య వినియోగం తీవ్రంగా దెబ్బతినడంతో ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై శాశ్వతంగా ఉంటుందని చౌదరి తెలిపారు.
సరిపడినంత నగదు ఉందని ఆర్ బీపై హామీ ఇస్తోంది కదా అని ప్రశ్నించినపుడు అది అంతా అబద్ధమని కొట్టి పారేశారు. నిజంగా తగినంత సొమ్ము ఉంటే, దేశంలోని 2 లక్షల ఏటీఎంలలో ఒక్కో దానిలో కోటి రూపాయలు ఎందుకు అందుబాటులోకి తేవడం లేదనీ , ప్రతి ఖాతాదారుడు రూ .5,000 లేదా రూ 10,000 డ్రా చేసుకోమని ఎందుకు చెప్పలేకపోతోందని ఆయన ప్రశ్నించారు. అలాగే ఇటీవల నగదు విత్ డ్రా పరిమితిని రోజుకు రూ.4500 పెంచినా ఒకటి రెండు ఏటీఎంలు అలా పనిచేయడపోవడమే ఇందుకు తార్కాణమని తెలిపారు.
జరుగుతున్న పరిణామాల్లో ఆర్ బీఐ నిశ్శబ్ద ప్రేక్షకుడులా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు. నిజానికి, ఆర్బిఐ మంటల్ని ఆర్చే ఫైర్ మ్యాన్ లా వ్యవహరించాలి. నీళ్ళు చల్లి మంటల్ని అదుపు చేయాలి. కానీ దీనికి విరుద్ధంగా ఆర్ బీఐ పారిపోతోందంటూ ఘాటుగా విమర్శించారు.
ప్రతీ దేశం పాత కరెన్సీని రద్దు చేసింది. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుందని వ్యాఖ్యానించారు. చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని రద్దు చేయడం సరైన నిర్ణయం కాదనీ, ఇది నకిలీ కరెన్సీని అడ్డుకోవడానికి పాక్షికంగా ఉపయోగపడుతుంది తప్ప నల్లధనాన్ని నిరోధించలేదని చెప్పారు. ఏ దేశమూ ఇలా చేయలేదని పేర్కొన్నారు. నోట్ల రద్దు పర్యవసానాల్ని అంచనా వేయడంలో, తగిన చర్యల్ని తీసుకోవడం కేంద్రం విఫలమైందని అనడంలో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు.