సిమ్లా: వీధి కుక్కల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ 50 అడుగుల నీటి గుంటలో పడిపోయిన జవానును ఓ సాధారణ గృహిణి రక్షించింది. తోటి జవానులు అతను మరణించాడని భావించి వెళ్లిపోయినా.. కొన ఊపిరితో వున్న అతనికి ప్రాణం పోసింది.
గత నెల 20న అస్సాం రైఫిల్స్ కు చెందిన జవానులు సిమ్లాకు దగ్గరలోని జుతోగ్ కాంట్ క్యాంప్ లో శిక్షణ పొందేందుకు వచ్చారు. శిక్షణలో ఉన్న సమయంలో కొన్ని వీధి కుక్కలు జవానులను వెంబడించాయి.. దీంతో వాటి నుంచి తప్పించుకునేందుకు జవానులందరూ పరుగులు పెట్టారు. వారిలో ముకేశ్ కుమార్ అనే జవాను అదుపుతప్పి పక్కనే ఉన్న గుంటలో పడిపోయాడు.
గుంటలో పడిన సమయంలో అతని తల రాయికి తగలడంతో సృహ కోల్పోయాడు. ముకేశ్ లో ఎలాంటి కదలికలు లేకపోవడంతో మిగిలిన జవానులు సాయం కోసం అరిచారు. ఆ శబ్దాలు విన్న వీణా శర్మ(42) హుటాహుటిని అక్కడికి చేరుకుని అతనికి శ్వాస అందించారు.. గుంటలో నుంచి అతన్ని బయటకు తీయడానికి ఆమెకు సాధ్యం కాలేదు. వెంటనే తన తండ్రి రమేశ్ శర్మ(72)ను పిలిచిన ఆమె అతన్ని బయటకు తీశారు. జవానుల్లో ఎవరికీ డ్రైవింగ్ రాకపోవడంతో రమేశ్ సొంతగా బండిని నడుపుకుంటూ ముకేశ్ ను ఆసుపత్రిలో చేర్పించారు.