జ్యోతిష్యం ముసుగులో బెట్టింగ్ రాకెట్!
పేరుకు జ్యోతిష్యుడు. కానీ నడిపేది మాత్రం బెట్టింగ్ రాకెట్. కొడుకుతో కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్న 75 ఏళ్ల జ్యోతిష్యుడిని ఆగ్నేయ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. వాళ్ల ఆశ్రమం లోపల జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను కూడా పట్టుకుని, వారి నుంచి రూ. 15వేలు స్వాధీనం చేసుకున్నారు. రామ్ స్నేహిలాల్ (75) అనే వృద్ధ జ్యోతిష్యుడే ఈ రాకెట్ మొత్తానికి సూత్రధారి అని, అతడు తన కొడుకును కూడా ఈ వ్యవహారంలోకి దింపాడని పోలీసులు తెలిపారు. జ్యోతిష్య కేంద్రం ముసుగులోనే ఆయన ఈ రాకెట్ నడుపుతున్నారన్నారు.
రామ్ స్నేహిలాల్‌కు అంగవైకల్యం కూడా ఉండటంతో.. పోలీసులు ఎప్పుడు సోదా చేసినా, తనకేమీ తెలియదని ఇన్నాళ్ల బట్టి తప్పించుకుని తిరిగేవాడు. ఇప్పటివరకు ఎప్పుడూ పోలీసులకు దొరకలేదు. కేవలం జ్యోతిష్యం చెప్పించుకోడానికి మాత్రమే ప్రజలు తనవద్దకు వస్తారని చెప్పేవాడు. లాల్ కొడుకు ఛోటేతో పాటు జూదం ఆడేందుకు వచ్చిన రామ్ సింగ్, రవీందర్, శ్యామ్‌లాల్ వర్మ అనే ముగ్గురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి తమ క్లయింట్లు, వాళ్ల బెట్టింగ్ వివరాలు రాసే పుస్తకాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్నాళ్లుగా తెలియకపోయినా, తాజాగా తమకు విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం పోలీసులు ఈ దాడి చేశారు. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయంలో వెళ్లిన పోలీసులకు అక్కడ స్నేహిలాల్ ఇంటి బయట చాలామంది గుమిగూడి కనిపించారు. అక్కడ ఎందుకంత మంది ఉన్నారని ప్రశ్నించగా.. అంతా తన క్లయింట్లని బుకాయించాడు. లోపలకు వెళ్లి చూడగా మొత్తం బాగోతం బయటపడింది.