
దేశ చరిత్రలోనే అతిపెద్ద లైంగిక వేధింపుల కేసు
- జర్మనీలో కలకలం.. 567 మంది బాలురపై కీచకపర్వం
బెర్లిన్: ఆస్కార్ ఉత్తమ చిత్రం(2015) ‘స్పాట్‌లైట్’ గుర్తుందా? బోస్టన్(అమెరికా)లో కొందరు మతగురువులు చర్చిలలో చదివే విద్యార్థులు, పాటలు పాడే బాలలపై లైంగికదాడులకు పాల్పడిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరక్కెక్కిందా సినిమా. సరిగ్గా అలాంటి విషయాలే ఇప్పుడు జర్మనీలో వెలుగుచూశాయి. దీనిని జర్మనీ దేశ చరిత్రలోనే అతిపెద్ద లైంగిక వేధింపుల కేసుగా భావిస్తున్నారు.
బెర్లిన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత రెవెన్స్‌బర్గర్ డోమ్స్‌పేజెన్ క్యాథలిక్ చర్చి గాయకుల బృందంలోని బాలురపై కొన్నేళ్లుగా జరుగుతున్న దారుణాలు బయటపడటం గమనార్హం. 1945 నుంచి 1990 వరకు ఇక్కడి కోయిర్‌లోని బాలురు 500మందిపై శారీరక దాడులు, 67 మందిపై లైంగికదాడులు చోటుచేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
పలు ఆరోపణల నేపథ్యంలో చర్చి అధికారులు.. ఉల్రిచ్ వెబర్ అనే లాయర్‌ను దీనిపై విచారణకు నియమించారు. ఆయన గత ఏడాది మధ్యంతర నివేదిక అందజేశారు. తాజాగా ఆ నివేదికలోని అంశాలు వెలుగులోకి రావడంతో జర్మనీ అంతటా కలకలం రేగింది. దర్యాప్తులో భాగంగా ఆయన బాధితులకు ప్రత్యేకంగా లేఖలు రాసి, వాంగ్మూలం రికార్డు చేశారు. చర్చి గాయకుల బృందం(కోయిర్)లో సభ్యులుగా ఉన్నన్ని రోజులు తాము నరకం చవిచూశామని బాధితులు తెలిపారు. జైలులో మాదిరి చిత్రహింసలు అనుభవించామని వెల్లడించారు.
దీనిపై స్పందించిన చర్చి అధికారులకు బాధితులకు పరిహారంగా ఇరవై వేల డాలర్లు చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ దారుణాలపై చర్చి ప్రస్తుత బిషప్ రుడోల్ఫ్ వోడెర్‌హోల్జెర్ బాధితులకు క్షమాపణలు తెలిపారు. ఈయనకంటే ముందున్న కార్డినల్ గెర్హార్డ్ లుడ్విగ్ ముల్లర్‌పై పలు ఆరోపణలున్నాయి. ఈ కేసు దర్యాప్తునకు ఆయన ఆటంకం కలిగించటంతోపాటు దీనిపై మీడియా పెద్దదిగా చూపిస్తోందని ఆరోపణలు చేశారు.