గుడి వద్ద తొక్కిసలాట
10 మంది మృతి, 30 మందికి గాయాలు
- జార్ఖండ్‌లోని వైద్యనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రంలో దారుణం
- ఆలయం తలుపులు తెరిచారన్న పుకార్లతో తొక్కిసలాట
దేవ్‌గఢ్(జార్ఖండ్): శ్రావణమాసం.. రెండో సోమవారం.. దైవదర్శనానికి ఆ ఆలయం ముందు వేలాది భక్తులు బారులు తీరారు.. రాత్రి నుంచే కిలోమీటర్ల మేర నిలుచున్నారు.. చాలామంది వరుసలోనే నిద్రపోయారు.. ఇంతలో అలజడి.. గుడి తలుపులు తెరిచేశారని పుకార్లు.. వరుసలో ఉన్నవారిని తోసుకుంటూ కొందరు ముందుకు దూసుకుపోయారు.. తొక్కిసలాట మొదలైంది.. కాసేపటికే 10 మంది భక్తులు విగతజీవులుగా పడిపోయారు! 30 మంది గాయపడ్డారు. జార్ఖండ్‌లోని దేవ్‌గఢ్‌లో జ్యోతిర్లింగ క్షేత్రమైన వైద్యనాథ్ ఆలయం వద్ద సోమవారం వేకువజామున 4 గంటలకు ఈ దారుణం చోటుచేసుకుంది.
బారికేడ్లు లేవు.. సిబ్బంది లేరు..
శ్రావణమాసంలో ఏటా ఈ క్షేత్రానికి వేలాది భక్తులు వస్తారు. ఈసారీ ఆదివారం రాత్రి నుంచే జనం పెద్దఎత్తున తరలివచ్చారు. శివలింగానికి అభిషేకం చేసేందుకు కన్వారియాలు(శివభక్తులు) గంగాజలంతో వచ్చారు. రాత్రంతా వరుసలో నిలబడి నీరసించడంతో చాలామంది నిద్ర పోయారు. ‘ఆలయం తలుపు తెరిచారని పుకారు రావడంతో ఒక్కసారిగా తోపులాట మొదలై తొక్కిసలాటకు దారి తీసింది. చాలామంది ఊపిరాడక మరణించారు. మృతుల్లో ఒక మహిళ, తొమ్మిది మంది పురుషులు ఉన్నారు’ అని అదనపు డీజీపీ ఎస్‌ఎన్ ప్రదాన్ తెలిపారు. గాయపడినవారికి ఆసుపత్రుల్లో చికిత్స అందజేస్తున్నారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
‘ఆలయం ముందు కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. బారికేడ్లు లేవు. జనాన్ని అదుపు చేసేందుకు తగినంత భద్రతా సిబ్బంది కూడా లేరు. వాలుగా ఉన్న ప్రదేశం నుంచి ఇద్దరు భక్తులు కిందకు జారిపడ్డారు. దీంతో అలజడి రేగింది. ఇదీ తొక్కిసలాటకు కారణమైంది. గుడికి సరిగ్గా 4 కి.మీ దూరంలో తొక్కిసలాట జరిగింది’ అని ఈ ఘటనపై దర్యాప్తు కోసం నియమించిన త్రిసభ్య కమిటీ అధినేత, హోంశాఖ కార్యదర్శి ఎన్‌ఎన్ పాండే తెలిపారు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా, జార్ఖండ్ సీఎం రఘుబర్‌దాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబీకులకు మోదీ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేల పరిహారం ప్రకటించింది. ఆలయ యాజమాన్య బోర్డు కూడా మృతుల కుటుంబీకులకు రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.25 వేల పరిహారం ప్రకటించింది. భక్తుల రద్దీ నేపథ్యంలో జార్ఖండ్‌కు అదనపు బలగాలను పంపనున్నట్లు కేంద్రం లోక్‌సభలో తెలిపింది. కేంద్ర దళాలతోపాటు రెండు కంపెనీల రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను దియోగఢ్‌కు పంపనున్నట్లు పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి ఒక ఒక ఎస్పీ, డీఎస్పీ, ఇద్దరు పోలీసులను జార్ఖండ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.