ప్రధాని మోదీపై ప్రశంసలే ప్రశంసలు!
న్యూఢిల్లీ: భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మల్కం టర్నబుల్ ప్రధాని నరేంద్రమోదీని ప్రశంసల్లో ముంచెత్తారు. అభివృద్ధి, ఆర్థిక వృద్ధి పథంలో దేశాన్ని ప్రశంసనీయమైన రీతిలో ప్రధాని మోదీ నడిపిస్తున్నారని కొనియాడారు.
’మన బంధం బలమైనది. ఈ పర్యటనతో మరింత బలోపేతం కానున్నది. ప్రధాని మోదీ ఈ దేశాన్ని ఎంతో అసాధారణమైనరీతిలో ఆర్థిక వృద్ధి, అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. భారత్ సాధించిన విజయాలు యావత్ ప్రపంచానికి ప్రశంసదాయకం. భారత్‌తో మరింత సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన అన్నారు. లాంఛనప్రాయమైన రాష్ట్రపతి భవన్‌లో విందు సందర్భంగా ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘ఆస్ట్రేలియాలోని 5 లక్షలమందికి భారత నేపథ్యముంది. ఇరుదేశాలు ఉమ్మడి లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి’ అని అన్నారు. తొలిసారి భారత పర్యటనకు వచ్చిన టర్నబుల్ సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. తన నాలుగురోజుల పర్యటనలో భాగంగా ఆయన మంగళవారం ముంబైలో పర్యటించి.. ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు.