ఆ రూమర్లను కొట్టిపారేసిన యాక్సిస్ బ్యాంకు
Published Wed, Mar 22 2017 1:22 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రక్రియలో కొంతమంది అధికారుల అవకతవకలు యాక్సిస్ బ్యాంకు తీవ్ర ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. ఆదాయపు పన్ను శాఖ దాడులతో ఆ బ్యాంకు విసుగెత్తిపోయింది. ఆ సమస్య కొంత సద్దుమణిగిందో లేదో యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖా శర్మ రాజీనామా చేస్తున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అయితే ఈ వార్తలన్ని అసత్యమని యాక్సిస్ బ్యాంకు కొట్టిపారేసింది. తమ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో శిఖా శర్మ రాజీనామా చేయడం లేదని యాక్సిస్ బ్యాంకు బుధవారం తేల్చి చెప్పింది.
సోషల్ మీడియాలో వస్తుందంతా అబద్ధమని, ఇన్వెస్టర్లను, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ ప్రైవేట్ దిగ్గజం బీఎస్ఈకి స్పష్టంచేసింది. పెద్ద నోట్ల రద్దు కాలంలో కొన్ని శాఖల్లో నెలకొన్న అక్రమాలతో ఆదాయపు పన్ను శాఖ ఆ బ్యాంకుపై పలు దాడులు నిర్వహించింది. అంతేకాక మూడో క్వార్టర్ ఫలితాలు బ్యాంకును నిరాశపరిచాయి. మొండిబకాయిలు గుట్టలుగుట్టలుగా పెరిగిపోవడంతో బ్యాంకు నికర లాభాలు 73 శాతం పడిపోయి రూ.580 కోట్లగా నమోదయ్యాయి.
Advertisement
Advertisement