యాక్సిస్ లాభం 18% అప్
ఒక్కో షేర్‌కు రూ.4.6 డివిడెండ్
ముంబై : ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 18 శాతం వృద్ధి సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.1,842 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.2,181 కోట్లకు పెరిగిందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.10,179 కోట్ల నుంచి రూ.12,384 కోట్లకు ఎగసిందని పేర్కొంది.
గత ఆర్థిక సంవత్సరానికి రూ.2 ముఖ విలువ ఉన్న ఒక్కో షేర్‌కు రూ.4.60 (230 శాతం) డివిడెండ్‌ను ప్రకటించింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.6,218 కోట్ల నుంచి 18 శాతం వృద్ధితో రూ.7,358 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.38,046 కోట్ల నుంచి రూ.43,844 కోట్లకు ఎగసిందని వివరించింది. స్థూల మొండి బకాయిలు 1.22 శాతం నుంచి 1.34 శాతానికి, నికర మొండి బకాయిలు 0.4 శాతం నుంచి 0.44 శాతానికి పెరిగాయని తెలిపింది.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 3.1 శాతం వృద్ధితో రూ.552 వద్ద ముగిసింది.