
2019లో పోటీపై క్లారిటీ ఇచ్చిన బాలయ్య
హిందూపురం: సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. 2019 ఎన్నికల్లో పోటీ విషయమై క్లారిటీ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో తాను కృష్ణా జిల్లా గుడివాడ, మైలవరం స్థానాల నుంచి తాను పోటీ చేస్తాననే ప్రచారం నిజం కాదని పేర్కొన్నారు. ఆదివారం హిందూపురంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. 2019లోనూ హిందూపురం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
స్థానికంగా పార్టీ నేతల్లో ఎలాంటి విభేదాలు లేవనీ, ఒకవేళ ఉన్నా వాటికి భయపడటం తన రక్తంలోనే లేదన్నారు. ఇకపై పారిశ్రామికాభివృద్ధి వైపు దృష్టి సారిస్తానని, అనంతపురం ‘హిందూపురం అర్బన్ అధారిటి ద్వారా పరిశ్రమలు నెలకొల్పడానికి కార్యాచరణ జరుగుతోందన్నారు.
కృష్ణదేవరాయల కాలం నాటి చెరువులను త్వరలోనే హంద్రీనీవా నీటితో నింపుతామని అన్నారు. అలాగే రూ. 194 కోట్లతో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురానికి ప్రత్యేక పైప్ లైన్ వేసే ప్రక్రియకు త్వరలోనే టెండర్లు పిలిచి ఐదునెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. పట్టణంలో రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ సిగ్నలింగ్ సిస్టం ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసుస్టేషన్ నెలకొల్పాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి సరిగాలేకున్నా, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకువస్తున్నామని చెప్పారు.
శ్రావణ మాసంలో రూ.23 కోట్లతో నిర్మించనున్న కూరగాయల మార్కెట్‌కు భూమిపూజ చేయడంతో పాటు ఆర్టీఓ కార్యాలయం, పశువు ఆసుపత్రి భవనాలు కూడా ప్రారంభిస్తామని బాలయ్య అన్నారు. ఇక విలేకరులకు ఇంటిపట్టాల మంజూరులో ఉన్న సమస్యను పరిష్కరించి పట్టాలు అందించడానికి కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో పార్టీ పరిశీలకులు కృష్ణమూర్తి, పీఏ వీరయ్యలు ఉన్నారు.