ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం సహా విపక్షాలు ఎన్నికలను బహిష్కరిస్తున్నా, కొత్త పార్లమెంటును ఎన్నుకొనేందుకు బంగ్లాదేశ్ ఆదివారం ఎన్నికలకు సిద్ధపడుతోంది.
ఢాకా: ఒకవైపు ప్రధాన ప్రతిపక్షం సహా విపక్షాలు ఎన్నికలను బహిష్కరిస్తున్నా, కొత్త పార్లమెంటును ఎన్నుకొనేందుకు బంగ్లాదేశ్ ఆదివారం ఎన్నికలకు సిద్ధపడుతోంది. పార్టీలకు అతీతంగా ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను అధికార అవామీ లీగ్ తోసిపుచ్చడంతో బీఎన్‌పీ నేతృత్వంలోని 18 పార్టీల కూటమి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. విపక్షాలు ఎన్నికలను బహిష్కరిస్తుండటంతో బంగ్లా ఎన్నికల విశ్వసనీయతపై సందేహాలు తలెత్తుతున్నాయి. బీఎన్‌పీ మద్దతుదారులు శనివారం 48 గంటల సమ్మెను ప్రారంభించారు. బీఎన్‌పీ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఇద్దరు మరణించారు.
ఎన్నికలను అడ్డుకునే లక్ష్యంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేపట్టిన బీఎన్‌పీ కార్యకర్తలు పలు పోలింగ్ కేంద్రాలకు, ఒక రైలుకు నిప్పుపెట్టారు. విపక్షాలు ఎన్నికలను బహిష్కరిస్తున్నా, సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు ప్రకటించారు. బంగ్లా పార్లమెంటులో 300 స్థానాలు ఉండగా, ఆదివారం 147 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయని, బీఎన్‌పీ, దాని మిత్రపక్షాలు ఈ ఎన్నికల్లో పాల్గొనడం లేదని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.