ఢాకా: బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశ పార్లమెంట్ రద్దు అయింది. ఈ మేరకు అధ్యక్షుడు మహ్మద్ షాహబుద్దీన్ ఓ ప్రకటన విడుదల చేశారు. రిజర్వేషన్ల కోటా నిరసనల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. అనంతరం ఆర్మీ నియంత్రణలోకి వెళ్లిన బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా చర్చలు జరుపుతున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
చదవండి: బంగ్లాదేశ్ పరిస్థితులను గమనిస్తున్నాం: కేంద్ర మంత్రి జైశంకర్
నూతన ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుడిగా మహ్మమద్ యూనస్‌ను నియమించాలంటూ నిరసనలు చేస్తున్న విద్యార్థి సంఘాల ప్రతిపాదన తీసుకొచ్చారు. దీనిపై ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ నిరసన విద్యార్థి నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
బంగ్లాదేశ్ ప్రధాని పదవికి నిన్న రాజీనామా చేసిన షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన వెంటనే నిన్న భారత్‌కు చేరుకున్నారు షేక్ హసీనా. ఘజియాబాద్ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు సైనిక విమానంలో వచ్చిన షేక్ హసీనా లండన్ వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. హసీనా వెంట ఆమె సోదరి హసీనా కూడా ఉన్నారు. ప్రస్తుతానికి రహస్య ప్రదేశంలో ఉన్న హసీనా బ్రిటన్ సర్కార్ నిర్ణయం కోసం వేచి చూస్తున్నారు. అయితే బ్రిటన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆదేశం నుంచి అనుమతి రాగానే లండన్ బయలు దేరి వెళ్లే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment