
వాణిజ్య వృద్ధికి మీరే ఉత్ప్రేరకాలు
న్యూఢిల్లీ: భారతదేశ శక్తిసామర్థ్యాలపై ప్రపంచ దేశాలకు అవగాహన పెంచే ఉత్ప్రేరకాలుగా పనిచేయాలని ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారుల(ఐఎఫ్‌ఎస్)ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. దేశ వాణిజ్య రంగ అభివృద్ధికి కృషిచేయాల్సిన బాధ్యత వారిపైనే ఉందన్నారు. ఐఎఫ్‌ఎస్ ప్రొబేషనరీ అధికారులను ఉద్దేశించి గురువారం మోడీ ప్రసంగించారు. విదేశాల్లో విధుల్లో ఉన్నప్పుడు భారతదేశ ప్రత్యేకతను, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించాలని ఈ సందర్భంగా మోడీ వారిని కోరారు. దేశ చరిత్ర, వివిధ దేశాలతో భారత్‌కున్న చారిత్రక సంబంధాలపై అవగాహన పెంచుకోవాలని వారికి సూచించారు. ఎగుమతులు వృద్ధి చెందాలంటే అత్యంత నాణ్యమైన, లోపరహిత ఉత్పాదనలపై భారత్ దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.
అలాగే వాటి ప్యాకేజింగ్, ప్రజెంటేషన్ల విధానాన్ని కూడా మెరుగుపర్చాలన్నారు. భారతీయ హెర్బల్ ఉత్పత్తులు ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైనవైనా.. ప్యాకేజింగ్‌లో లోపం కారణంగా చైనా ఉత్పత్తుల కన్నా వెనకబడి ఉన్నాయని మోడీ ఉదహరించారు.