రిసెప్షనిస్టే కదా అనుకున్నాడు కానీ.. !
రియో ఒలింపిక్స్ లో పతకం సాధించిన బెల్జియం జూడో క్రీడాకారుడికి చేదు అనుభవం ఎదురైంది. మాంఛి కండలు తిరిగిన ఈ క్రీడాకారుడు ఓ హోటల్ రిసెప్షనిస్టును తేలికగా తీసుకున్నాడు. మహిళే కదా అని ఆమెను తోసి హోటల్ లోకి వెళ్దామని ప్రయత్నించాడు. కానీ ఆమె ఒక్కటే ఒక్క పంచ్ ఇచ్చింది. దెబ్బకు అతడి కన్ను వాచి నల్లగా కమిలిపోయింది. ఆ మహిళా రిసెప్షనిస్ట్ బ్రెజిల్ మార్షల్ ఆర్ట్స్ గా పేరొందిన జుజిత్సు నిపుణురాలు. ఆమె గురించి తెలియక దూకుడు చూపబోయిన అతనికి ఒక్కసారిగా చుక్కలు కనబడ్డాయి.
బ్రెజిల్ క్రీడాకారుడు డిర్క్ వాన్ టిచెల్ట్ (32) 72 కిలోల జూడో విభాగంలో ఒలింపిక్స్ రజత పతకం సాధించాడు. ఈ ఆనందంలో సోమవారం రాత్రి విజయోత్సవం చేసుకుంటున్న అతడికి చేదు అనుభవం ఎదురైంది. ఓ గుర్తుతెలియని మహిళ అతని ట్రైనర్ జేబులోంచి సెల్ ఫోన్ దొంగలించి.. సమీపంలో ఉన్న బెస్ట్ వెస్ట్రర్న్ ప్లస్ హోటల్ లోకి పరారైంది. ఆమెను వెంబడిస్తూ హోటల్ లోకి వెళ్లబోయిన డిర్క్ ను రిసెప్షనిస్టు నిలువరించింది. దీంతో ఆమెతో డిర్క్ వాగ్వాదానికి దిగాడు. దొంగకు రిసెప్షనిస్టుగా అండగా నిలుస్తున్నదని ఆరోపిస్తూ.. ఆమెను తప్పించుకొని హోటల్ లోకి వెళ్లేందుకు డిర్క్ ప్రయత్నించాడని, దీంతో ఆమె ఒక్క పంచ్ ఇచ్చిందని, ఆ దెబ్బకు అతని కన్ను నల్లగా కమిలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.