నా కెరీర్‌లో ఇదే బెస్ట్ మోమెంట్!
రియో డిజెనీరో: రియో ఒలింపిక్స్ విమెన్ సింగిల్స్ విభాగంలో సెమీస్‌లోకి అడుగుపెట్టిన భారత షట్లర్ పీవీ సింధు తన విజయప్రస్థానాన్ని మున్ముందు కూడా కొనసాగించాలని భావిస్తోంది. లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన చైనా షట్లర్ యిహన్ వాంగ్‌ను వరుస సెట్లలో ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తన కెరీర్‌లో ఉత్తమ విజయాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుందని పేర్కొంది. సెమీస్‌లో జపాన్ క్రీడాకారిణి నోజోమి ఒకుహరాపై కూడా మంచి ప్రదర్శన ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిపింది.
'రియో ఒలింపిక్స్‌లో ఈ విజయం సాధించడం ఓ భిన్నమైన భావనను కలిగిస్తోంది. ఇది నా కెరీర్‌లో బెస్ట్ మూమెంట్. మున్ముందు మరిన్ని విజయాలు వస్తాయని నేను ఆశిస్తున్నా' అని సింధు పేర్కొంది. వరల్డ్ నంబర్ 10 ర్యాంకర్ అయిన సింధు.. సైనా తర్వాత ఒలింపిక్స్ సెమీస్‌లోకి అడుగుపెట్టిన తొలి భారతీయ షట్లర్‌గా రికార్డు సృష్టించింది. హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సహనంతో చివరివరకు పోరాడటం వల్లే తనకు విజయం దక్కిందని ఆమె పేర్కొంది.