
బెల్జియం పోలీసుల వేట
బ్రసెల్స్ నిందితుల కోసం విస్తృత గాలింపు
ఇద్దరు మంత్రుల రాజీనామా!
దాడులపై త్వరలోనే స్పష్టత ఇస్తానన్న ప్రధాని
బ్రసెల్స్: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో వరు స పేలుళ్లకు పాల్పడిన వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా భావిస్తున్న ఇద్దరి కోసం వేటాడుతున్నారు. మెట్రో రైల్వే స్టేషన్‌లో ఘటనాస్థలంలో ఒకరిని అనుమానాస్పదంగా గుర్తించగా, మరొకరిని అనుమానాస్పద బాంబర్ (నజిమ్ లాచ్రోయి)గా విమానాశ్రయం సీసీటీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. తమను పేల్చేసుకున్న బక్రోయి సోదరుల గురించి పోలీసులకు తెలుసని, వారిలో ఒకడైన ఇబ్రహీం బక్రోయి టర్కీ నుంచి వచ్చినట్లు భద్రతా అధికారులు కనుగొన్నారు. అతడి గురించి తాము ముందుగానే హెచ్చరించినప్పటికీ అతడికున్న ఉగ్రవాద సంబంధాలను కనుగొనడంలో బెల్జియం పోలీసులు విఫలమయ్యారని టర్కీ అధ్యక్షుడు రికెప్ టయీప్ ఎర్డోగన్ చెప్పారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే దాడులు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఇద్దరు బెల్జియం మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. అంతర్గత భద్రత మంత్రి జాన్ జంబోన్, న్యాయ శాఖ మంత్రి కోయెన్ రాజీనామా చేసినట్లు మీడియా తెలిపింది. దాడుల గురించి త్వరలోనే స్పష్టత ఇస్తామని బెల్జియం ప్రధాని చార్లెస్ మిచెల్ చెప్పారు. బ్రసెల్స్ దాడులతో యూరోపియన్ యూనియన్ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆయా దేశాల న్యాయ, హోం శాఖ మంత్రులు త్వరలోనే బ్రసెల్స్‌లో భేటీ అయి ఉగ్రవాద పోరుకు కార్యాచరణ రూపొందించనున్నారు.
పెద్ద ఎత్తున నివాళి
వరుస పేలుళ్లతో 31 మంది మరణించిన ఘటన షాక్ నుంచి బెల్జియం ఇంకా తేరుకోలేదు. బ్రసెల్స్‌లోని ‘ప్లేస్ డి లా బౌర్స్’ అనే సెంటర్ వద్దకు ప్రజలు పెద్దఎత్తున వచ్చి నివాళులర్పించారు. తామంతా ఒకే కుటుంబానికి చెందిన వారమని, ప్రపంచమంతా తమతో ఉందంటూ సందేశమిస్తున్నారు. ఇస్లామిక్ స్టే ట్ జిహాదీలు యూరప్‌లో మరిన్ని దాడులకు పాల్పడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఐసిస్‌తో సంబంధాలున్నాయన్న అనుమానంతో 162 మందిని మలేసియాలోని కౌలాలంపూర్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు.
అబ్దెస్లామ్‌కు తెలియదు
పారిస్ దాడుల నిందితుడైన సలాహ్ అబ్దెస్లామ్‌కు బ్రసెల్స్ పేలుళ్ల గురించి తెలియదని అతడి న్యాయవాది స్వెన్ మేరీ చెప్పారు. అబ్దెస్లామ్‌ను జైల్లో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారన్నారు. బెల్జియంలో దాడులకు ముందు అబ్దెస్లామ్ బ్రసెల్స్‌లో పట్టుబడిన సంగతి తెలిసిందే. అబ్దెస్లామ్‌పై బెల్జియం పోలీసులు అభియోగాలు నమోదుచేయగా, విచారణ నిమిత్తం అతడిని అప్పగించాలని ఫ్రాన్స్ అధికారులు కోరారు. వెంటనే తనను ఫ్రాన్స్‌కు అప్పగించాలని అబ్దెస్లామ్ చెప్పాడని, దీనిని వ్యతిరేకించవద్దని మేజిస్ట్రేట్‌ను కోరతానని మేరీ పేర్కొన్నారు.
భారతీయుడి చివరి ఫోన్ కాల్ గుర్తింపు
పేలుళ్ల అనంతరం గల్లంతైన భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రాఘవేంద్రన్ గణేశ్ చివరి ఫోన్‌కాల్‌ను అధికారులు గుర్తించారు. బెంగళూరు ఇన్ఫోసిస్‌కు చెందిన గణేశ్ చివరి కాల్‌ను బ్రసెల్స్‌లో మెట్రో రైల్లో మాట్లాడినట్లు కనుగొన్నారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విటర్‌లో తెలిపారు. ఆయన ఆచూకీ కోసం ఎంబసీ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పారు.