
నటి అనుమానాస్పద మృతి.. హత్యా?
కోలకత్తా: బెంగాలీ నటీ అనుమానాస్పద స్థితిలో శవమై తేలింది. కోలకతాలోని ఆమె నివాసంలో ఉరికి వేలాడుతూ కనిపించింది. సినీ, టీవీ నటి బితాస్తా సాహా ఫ్లాట్ లోనే బెడ్ రూంలో ఆమె మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో బయటపడింది. అయితే ఆమెది ఆత్మహత్యా? లేక అత్యాచారం చేసి హతమార్చారా అనే సందేహాలు నెలకొన్నాయి.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, దక్షిణ కోల్ కతాలోని కాస్బా ప్రాంతంలో సాహా నివాసం ఉంటోంది. గత రెండు రోజులుగా ఆమె ఫోన్ కు ఎన్నిసార్లు కాల్ చేసినా సమాధానం రాకపోవడం, ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో బితాస్తా సాహా తల్లికి అనుమానం వచ్చింది. దీంతో మంగళవారం సాయంత్రం ఆమె ఫ్లాట్ కు వచ్చి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. లోపలి నుంచి గడియ పెట్టి ఉండటం, ఎంతకీ స్పందన లేకపోవడంతో తల్లి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు తలుపులు పగలు కొట్టారు. కుళ్లిపోయిన స్థితిలో బితాస్తా సాహా శరీరం సీలింగ్ కు వేలాడుతూ కనిపించింది. శరీరంపై పలు చోట్ల గాయాలుతో పాటు రెండు చేతులపైనా తీవ్ర గాయాలు ఉన్నాయి. మణికట్టు విరిచేసి ఉండడం అనుమానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో సాహా ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, అత్యాచారం, హత్య అనుమానాలు కూడా కలుగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు. ఆమె చనిపోయి రెండుమూడ్రోజులు అయ్యి వుండవచ్చన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపామని, సాహా ఫేస్ బుక్ పోస్టులు పరిశీలిస్తే, ఆమె కొంత డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తోందని, విచారణ జరుపుతున్నామని వివరించారు.
కాగా సాహా ఫేస్ బుక్ ఖాతాలో ‘నా ఆవేదన మీకు ఎప్పటికీ అర్థంకాదు. నా బాధ, ఆవేదనతో నీకు సంబంధంలేదు. నేను చేసిన తప్పేంటి చెప్పు..నా బాధను నీతో చెప్పలేను..నా గుండెకోతను అర్థం చేసుకుంటే..’ తదితర పోస్టులను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆమె స్నేహితులు, పొరుగువారిని పోలీసులు విచారిస్తున్నారు. 2016లో విడుదలైన ‘బాంచా ఎలో ఫిరే’ సినిమాలో సాహా నటించారు.