చరిత్రను సరిచేసే సమయమొచ్చింది
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: పాశ్చాత్య భావజాలం, వామపక్ష ధోరణి ఉన్న చరిత్రకారులు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేసే వారు కలసికట్టుగా దేశ చరిత్రను నాశనం చేశారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఆదివారం సదరన్ నేవల్ కమాండ్ ఆర్థిక సలహాదారు వేద్‌వీర్ ఆర్య రచించిన ‘ది క్రొనాలజీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. బ్రిటిష్ పాలకుల వల్ల దేశ చరిత్ర అనేక వక్రీకరణలకు గురైందని, 1857 నాటి తొలి స్వాతంత్య్ర పోరాటాన్ని కూడా సిపాయిల తిరుగుబాటుగా చదువుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు దేశ చరిత్రను తప్పనిసరి పాఠ్యాంశం చేయాలన్నారు. ఫ్రెంచ్ విప్లవం తరహాలో భారతీయ సంస్కృతి విప్లవం రావాలన్నారు.
విపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి
విపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నాయని, ఢిల్లీలోని ఔరంగజేబు రోడ్డుకు అబ్దుల్ కలాం పేరు పెట్టినా నానా యాగీ చేస్తున్నాయన్నారు. బీజేపీ, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌లు ఈ ప్రతిపాదన చేయలేదని, తారీఖ్ ఫతా అనే పాకిస్తానీ కెనడియన్ ప్రతిపాదించారని చెప్పారు.
చరిత్రపై చర్చ జరగాలి: వేద్‌వీర్ ఆర్య
భారత ఇతిహాస కాలాన్ని లెక్కించేందుకు పురాణ కాలం నుంచి పాటిస్తున్న గణాంక వ్యవస్థను గుప్తుల కాలం తరువాత ఆపేయడంతో ఎన్నో తప్పిదాలు జరిగాయని వేద్‌వీర్ ఆర్య అన్నారు. కార్యక్రమంలో వేద్‌వీర్ ఆర్య తండ్రి ఆచార్య రఘుమన్న, ఆర్‌సీఐ డెరైక్టర్, రక్షణ శాఖ శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి, విజ్ఞానభారతి సెక్రటరీ జనరల్ జయంత్ సహస్రబుద్దే, ఫోరం ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ సెక్రటరీ జనరల్ బాలదేశాయి తదితరులు పాల్గొన్నారు.