దావూద్ ఆరోగ్యంపై స్పందించిన ఛోటా షకీల్
అంతర్జాతీయ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు గుండెపోటు వచ్చిందని ఒకసారి.. కాదు కన్నుమూశాడని మరోసారి సోషల్ మీడియాలో రకరకాలుగా వదంతులు వినిపిస్తున్న నేపథ్యంలో అతడి సన్నిహిత అనుచరుడు ఛోటా షకీల్ స్పందించాడు. అతడి ఆరోగ్యం భేషుగ్గా ఉందని, దావూద్‌కు అనారోగ్యంగా ఉందంటూ పాకిస్తానీ మీడియాలో వచ్చినవన్నీ పచ్చి అబద్ధాలని చెప్పాడు. వాస్తవానికి శుక్రవారం నుంచే దావూద్ ఇబ్రహీం చనిపోయాడంటూ వదంతులు వ్యాపించాయి.
దీనిపై ఛోటా షకీల్ కరాచీ నుంచి భారతీయ జాతీయ మీడియాతో మాట్లాడాడు. ''నా గొంతు వింటే మీకు ఏమైనా జరిగినట్లు అనిపిస్తోందా? అవన్నీ వదంతులే. భాయీ బ్రహ్మాండంగా ఉన్నారు, ఎలాంటి సమస్యా లేదు'' అని ఛోటా షకీల్ చెప్పాడు. కరాచీలోని ఆగాఖాన్ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం విషమ పరిస్థితిలో ఉన్నట్లుగా కథనాలు వచ్చాయి. అతడు గత కొంత కాలంగా పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో పరిస్థితి మరింత విషమించిందని పాకిస్తానీ మీడియాలోని ఒక వర్గం తెలిపింది. అయితే ఇప్పుడు అదంతా తప్పేనని ఛోటా షకీల్ అంటున్నాడు.