భత్కల్ పరారీకి ఐఎస్‌ఐఎస్ ప్లాన్!
మరోసారి హెచ్చరికలు జారీ చేసిన ఇంటెలిజెన్స్
భత్కల్ కదలికలపై డేగకన్ను
చర్లపల్లి జైలు వద్ద ఆక్టోపస్ బలగాలు
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాయిద్దీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌ను జైలు నుంచి తప్పించేందుకు ఐఎస్‌ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) పెద్ద కుట్ర చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) గుర్తించింది. చర్లపల్లి జైలు నుంచి భత్కల్‌తో పాటు మిగతా ఉగ్రవాదులను తప్పించేందుకు స్లీపర్ సెల్స్ ప్రణాళికలు రచిస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాల ద్వారా జైలు అధికారులకు సమాచారం చేరింది.
నెల రోజుల వ్యవధిలో రెండవసారి కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ కావడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. భత్కల్ కదలికలను గమనించేందుకు ఆయన ఉంటున్న బ్యారక్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. జైలు గోడలను బద్దలు కొట్టైనా బయటకొస్తానంటూ భత్కల్ తన భార్యకు ఫోన్‌లో చెప్పినట్లు నిఘా వర్గాలు భావిస్తుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉగ్రమూకలను సమర్థంగా తిప్పికొట్టగలిగే ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి 30 మంది బలగాలు జైలు పరిసరాలలో గస్తీ నిర్వహిస్తున్నాయి.
నిఘా వర్గాల సీరియస్..
ఇటీవలి కాలంలో భత్కల్ వ్యవహరిస్తున్న తీరును నిఘా వర్గాలు సీరియస్‌గా తీసుకున్నాయి. దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి ట్రయల్స్ నిమిత్తం కోర్టుకు తీసుకెళ్లిన ప్రతీసారి భత్కల్ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రంగారెడ్డి కోర్టుకొచ్చిన మూడుసార్లు భత్కల్ వ్యవహరించిన శైలిపై పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనెల 6వ తేదీన కోర్టుకు వచ్చిన భత్కల్.. భద్రత పేరుతో లేఖ రాసి కోర్టు ఆవరణలో విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఒక గులాబీ పువ్వును ప్రదర్శించాడు. మూడవసారి ఒక నోట్‌బుక్‌ను చూపిస్తూ హల్‌చల్ చేశాడు. అయితే వీటిని నిఘా వర్గాలు సీరియస్‌గా తీసుకున్నాయి. మూడుసార్లు భిన్నంగా వ్యవహరించడానికి కారణాలేంటి అనేదానిపై విశ్లేషిస్తున్నట్లు సమాచారం.
భత్కల్ ఎవరికైనా ఇండికేషన్స్ ఇస్తున్నాడా? స్లీపర్ సెల్స్ ఏమైనా ఫాలో అవుతున్నాయా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా భత్కల్ నోటి నుంచి ఐఎస్‌ఐఎస్ విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు మరింత సీరియస్‌గా తీసుకున్నారు. ఐఎస్‌ఐఎస్‌తో భత్కల్‌కు గల సంబంధంపై నిఘా వర్గాలు లోతుగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజులుగా కశ్మీర్‌లో ఐఎస్ జెండాలు ప్రదర్శించడంతో మరింత అప్రమత్తమయ్యారు. ఇలాంటి చర్యల నేపథ్యంలో ఓ వైపు భత్కల్ కదలికలపై నిఘా వేస్తూనే, మరో వైపు జైలు భద్రతపై అధికారులు దృష్టి సారించారు.