
‘భోపాల్ గ్యాస్’ అండర్సన్ మృతి
అమెరికాలో మరణించిన యూనియన్ కార్బైడ్ మాజీ చైర్మన్
సెప్టెంబర్ 29నే చనిపోయినా.. ప్రపంచానికి వెల్లడించని కుటుంబం
వాషింగ్టన్: భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనకు కారణమైన ‘యూనియన్ కార్బైడ్(యూసీ)’ సంస్థకు.. ఆ దుర్ఘటన సమయంలో చైర్మన్‌గా వ్యవహరించిన వారెన్ అండర్సన్(92) అమెరికాలో మరణించారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని వెరో బీచ్‌లోని ఆస్పత్రిలో సెప్టెంబర్ 29న అండర్సన్ మరణించారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించేంతవరకు ఆ విషయం రహస్యంగా ఉండిపోయింది. అండర్సన్ కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని బహిర్గతపర్చలేదు. ప్రభుత్వ రికార్డుల ద్వారా అండర్సన్ మరణ వార్తను ధ్రువీకరించుకున్నామని ఆ పత్రిక పేర్కొంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పురుగుమందులు తయారుచేసే యూనియన్ కార్బైడ్ పరిశ్రమ నుంచి 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి మిథైల్ ఐసో సయనైడ్ అనే విష రసాయనం లీకైన ఘటనలో అధికారిక లెక్కల ప్రకారం 3,787 మంది మృత్యువాత పడ్డారు.
నిజానికి మృతుల సంఖ్య ఎక్కువే ఉంటుందని అంచనా. మరికొన్నివేల మంది ఊపిరితిత్తుల కేన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధుల బారిన పడి జీవచ్ఛవాలుగా మారారు. ఆ సమయంలో యూసీకి అధినేతగా ఉన్న అండర్సన్..ఆ దుర్ఘటన జరిగిన 4 రోజుల తర్వాత భోపాల్‌కు వెళ్లి అరెస్టయ్యారు. ఆ వెంటనే బెయిల్ పొంది దేశం విడిచి పారిపోయి, మళ్లీ తిరిగిరాలేదు. ఆయనను భారత్‌కు తిరిగి రప్పించి, విచారణ జరిపేందుకు భారత్ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. అండర్సన్‌ను పరారీలో ఉన్న వ్యక్తిగా భారత ప్రభుత్వం, కోర్టులు నిర్ధారించాయి. 1989లో గ్యాస్ లీకేజీ బాధితుల కోసం యూసీ సంస్థ 47 కోట్ల డాలర్లను భారత ప్రభుత్వానికి చెల్లించింది. 40 దేశాల్లో ఉన్న 700 పరిశ్రమలకు అండర్సన్ అధినేతగా ఉన్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అయితే, దుర్ఘటన అనంతరం షాక్‌కు గురైన అండర్సన్ వారం రోజుల పాటు హోటల్ గదిలో నుంచి బయటకు రాలేదని తెలిపింది. విచారణను, అరెస్ట్‌ను తప్పించుకునేందుకు తరచూ ఇళ్లను మారుస్తూ ఉండేవాడని పేర్కొంది. 1986లో యూసీకి ఆయన రాజీనామా చేశారు.
ఒక్క రోజు కూడా జైల్లో గడపకుండానే..
అండర్సన్ తగిన శిక్ష అనుభవించకుండానే మరణించాడని, అది భారత ప్రభుత్వ వైఫల్యమేనని భోపాల్ లీక్ బాధిత సంఘాలు విమర్శించాయి. 25 వేల మంది మరణానికి కారణమైన వ్యక్తి.. భారత్, యూఎస్ ప్రభుత్వాల సహకారం వల్ల కనీసం ఒక్క రోజు కూడా జైళ్లో గడపకుండానే చనిపోయాడని పేర్కొన్నాయి.