బీహార్ ఎన్నికలు: తొలి దశ పోలింగ్ ప్రారంభం
పాట్నా : బీహార్ శాసనసభకు మొదటి దశ పోలింగ్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఉదయం 7.00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొదటి దశలో రాష్ట్రంలోని 10 జిల్లాల్లోని మొత్తం 49 అసెంబ్లీ స్థానాలకుగాను 586 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టదిట్టమైన భద్రత చర్యలు చేసినట్లు అడిషనల్ చీఫ్ ఎలక్ట్రోలర్ అఫీసర్ ఆర్ లక్ష్మణన్ సోమవారం వెల్లడించారు. ఈ ఎన్నికల్లో 1,35,72,339 మంది ఓట్లర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. 10 జిల్లాల్లో మొత్తం 13212 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అయితే అత్యధిక ప్రాంతాల్లో పోలింగ్ సాయంత్రం 5.00 గంటలకు ముగుస్తుందన్నారు. నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని ప్రదేశాల్లో పోలింగ్ సాయంత్రం 3.00 గంటలు, మరికొన్ని చోట్ల సాయంత్రం 4.00 గంటలకు ముగియనుందని చెప్పారు.
మొదటి దశలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 54 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. బీహార్ శాసనసభకు మొదటి దశ అక్టోబర్ 12 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు మొత్తం ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరిగి... ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారు అనేది నవంబర్ 8వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ద్వారా అభ్యర్థుల భవితవ్యం తెలనుంది.