కూలింది ‘బిన్ లాడెన్’ క్రేన్
మక్కా: సౌదీ అరేబియాలోని మక్కా మసీదులో కూలిపోయి వందకుపైగా యాత్రికుల దుర్మరణానికి కారణమైన భారీ క్రే న్ ఒసామా బిన్ లాడెన్ కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీది. పాక్ భూభాగంలో అమెరికా జరిపిన కమాండో ఆపరేషన్లో అంతర్జాతీయ టైస్టు ఒసామా బిన్ లాడెన్ మరణించిన విషయం తెల్సిందే.
బిలియనీర్ అయిన బిల్ లాడెన్ తండ్రి మొహమ్మద్ సౌదీ అరేబియాలో బిన్‌లాడెన్ గ్రూప్ అనే కన్‌స్ట్రక్షన్ కంపెనీని ఏర్పాటు చేశారు. సౌదీ రాజుతో తనకున్న సంబంధాలను ఉపయోగించుకొని మొహమ్మద్ అక్కడ ఎన్నో ప్రాజెక్టులను చేపట్టారు. అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తారు. ఇప్పుడు ఆయన ఏర్పాటు చేసిన బిన్‌లాడెన్ గ్రూపే మక్కా మసీదు విస్తరణ కార్యక్రమాలను చేపట్టింది. అందుకనే బిన్‌లాడెన్ కుటుంబసభ్యులు భాగస్వామిగా ఉన్న జర్మనీ క్రేన్ కంపెనీ నుంచి భారీ క్రేన్లు తెప్పించి నిర్మాణ పనులు చేపట్టారు.
ఒకేసారి 22 లక్షల మంది యాత్రికులు ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా 1,40,000 కోట్ల రూపాయలతో మసీదు విస్తరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని అధికార వర్గాలు చెబుతుండగా, క్రేన్‌ను సరిగ్గా హ్యాండిల్ చేయలేక పోవడం వల్లనే ప్రమాదం సంభవించిందన్న వాదన కూడా ప్రజల నుంచి వినిపిస్తోంది.